'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు' | Indias First MMA Medallist Suchika Tariyal Makes Explosive Claim | Sakshi
Sakshi News home page

Asian Games: 'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు'

Sep 25 2026 8:59 AM | Updated on Sep 25 2026 9:08 AM

Indias First MMA Medallist Suchika Tariyal Makes Explosive Claim

ఆసియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందించిన సుచికా తరియాల్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సుచికా సంచలన వ్యాఖ్యలు చేసింది. విచిత్రమైన బరువు నిబంధనల కారణంగా తనకు దక్కాల్సిన స్వర్ణ పతకాన్ని లాక్కున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

"నేను సెమీఫైనల్ బౌట్‌లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాను. కానీ రిఫరీలు ఆ మ్యాచ్‌ను 'డ్రా'గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం డ్రా అయినప్పుడు మరో రౌండ్ పోటీ నిర్వహించాలి. కానీ అలా చేయకుండా అత్యంత విచిత్రమైన బరువు నిబంధనలను వర్తింపజేశారు. 

దీంతో నాకు దక్కాల్సిన స్వర్ణపతకం చేజారింది. వెయిట్-ఇన్ రూల్ ఒక చెత్త నిబంధన. నన్ను మరో రౌండ్ ఆడటానికి అనుమతించి ఉండాల్సింది. ఒకవేళ ఆ రౌండ్‌లో ఓడిపోయినా నేను దాన్ని అంగీకరించేదాన్ని. కానీ ఇలా అర్ధాంతరంగా ముగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. 

అయితే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ నావరకు అయితే కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తాననిపించింది. తీవ్రంగా శ్రమించి సెమీఫైనల్ స్థాయికి చేరుకున్నాను. అక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదు.

అదనంగా కేటాయించిన ఆ ఒక్క నిమిషం రౌండ్‌లో కూడా నేను ఆమెపై ఆధిపత్యం ప్రదర్శించాను. ప్రత్యర్థి వెనక్కి పారిపోతుంటే నేను దాడి చేస్తూనే ఉన్నాను. ఈ క్రీడా సమాఖ్య సింగపూర్‌కు చెందినదే కావడం వల్ల, బహుశా ఆమెను గెలిపించాల్సి వచ్చిందేమో" అని పీటీఐతో మాట్లాడుతూ సుచికా ఆరోపించింది.

అసలు ఏమి జరిగిందంటే?
జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియడ్‌ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగంలో  సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించింది. సింగపూర్‌కు చెందిన టీ హుయ్ హూన్‌తో జరిగిన సెమీఫైనల్లో సుచికా అద్భుత ప్రదర్శన చేసినా 'వెయిట్ రూల్' కారణంగా రజతం/పసిడి పోరుకు దూరమై కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 700 గ్రాముల బరువు వ్యత్యాసంతో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.

ఈ సెమీస్ పోరులో తొలి రౌండ్‌లో సుచికా కాస్త వెనకబడినప్పటికీ, రెండో రౌండ్‌లో అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో మ్యాచ్ ఓవర్ టైమ్‌కు వెళ్లింది. ఓవర్ టైమ్‌ పూర్తయ్యాక కూడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది.

అయితే మరో రౌండ్ నిర్వహించకుండా రిఫరీలు "వెయిట్-బేస్డ్ టైబ్రేకర్" నిబంధనను అమలు చేశారు. ఉదయం జరిగిన వెయిట్-ఇన్ లెక్కల ప్రకారం సుచికా కంటే సింగపూర్ అథ్లెట్ కేవలం 700 గ్రాములు తక్కువ బరువు ఉంది. ఆ నిబంధన ప్రకారమే తక్కువ బరువు ఉన్న సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించి ఫైనల్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement