
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్‌నకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.
కాగా గిల్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్‌జోన్ కెప్టెన్‌గా శుబ్‌మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.
ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే?