భారత్-న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక మ్యాచ్ భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మూడో వన్డేలో ఆడించాలని టీమ్‌మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అర్ష్‌దీప్‌కు అవకాశమివ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
బదోని అరంగేట్రం
ఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్‌మెనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.
పిచ్ రిపోర్ట్:
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్‌లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్‌పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.
మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్


