భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్‌ శర్మ | India Tour Of England 2026. List Of Records That Could Be Broken By Indians In T20Is, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్‌ శర్మ

Jul 1 2026 8:22 AM | Updated on Jul 1 2026 10:28 AM

India Tour Of England 2026: List Of Records That Could Be Broken By Indians In T20Is

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచి (జులై 1) మొదలుకానుంది. తొలి మ్యాచ్‌ చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతంది.

ఐర్లాండ్‌ చేతిలో అనూహ్య పరాభవం (0-2తో టీ20 సిరీస్‌ కోల్పోవడం) తర్వాత భారత్‌ ఆడుతున్న మొదటి మ్యాచ్‌ ఇది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేయస్‌ సేన పుంజుకుంటుందా లేక చెత్త ప్రదర్శన కొనసాగిస్తుందా అన్న అంశం భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్ల ముందున్న పలు వ్యక్తిగత రికార్డులు సైతం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

రోహిత్‌ రికార్డుపై కన్నేసిన అభిషేక్‌
ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ (12 ఇన్నింగ్స్‌లో 387 పరుగులు) చలామణి అవుతున్నాడు. అయితే ఈ రికార్డుపై ప్రస్తుత టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కన్నేశాడు. ఈ సిరీస్‌లో అభిషేక్‌ మరో 100 పరుగులు చేస్తే రోహిత్‌ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం అభిషేక్‌ ఇంగ్లండ్‌పై టీ20ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 288 పరుగులు చేశాడు.

హార్దిక్ రికార్డుకు ఎసరు
ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా (27 సిక్సర్లు) ముందున్నాడు. ఈ రికార్డుపై కూడా అభిషేక్‌ కన్నేశాడు. ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 22 సిక్సర్లు బాదిన అతడు.. ఈ సిరీస్‌లో మరో ఆరు సిక్సర్లు కొడితే హార్దిక్ రికార్డు బద్దలు కొడతాడు.

సంజూను ఊరిస్తున్న ధోని రికార్డు
ఇంగ్లండ్‌పై టీ20ల్లో ఇప్పటివరకు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసింది ఇద్దరే ఇద్దరు భారత వికెట్‌కీపర్లు. ధోని, సంజూ ఇంగ్లీష్‌ టీమ్‌పై తలో హాఫ్‌ సెంచరీ చేశారు. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో శాంసన్‌ మరో హాఫ్‌ సెంచరీ చేస్తే ధోనిని వెనక్కునెట్టి ఈ రికార్డు సోలోగా సాధించవచ్చు.

వరుణ్‌కు సువర్ణావకాశం
ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా హార్దిక్‌ పాండ్యా (21) చలామణి అవుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఈ రికార్డును సాధించేందుకు వరుణ్ చక్రవర్తికి మంచి అవకాశం ఉంది. వరుణ్‌ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 6 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అతడు మరో 7 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement