
పాక్‌తో ‘వైరం’ అనడంలో అర్థం లేదు
సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్య
దుబాయ్: ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం...అదే ఒకడు మీద పడిపోతే దండయాత్ర’... తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఇది. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా పాకిస్తాన్ గురించి చెప్పాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు పూర్తిగా ఏకపక్షమని అతను గుర్తు చేశాడు. అసలు ఇరు జట్ల మధ్య ఆటను ‘వైరం’తో పోల్చాల్సిన అవసరమే లేదని అతను స్పష్టం చేశాడు.
భారత్, పాక్ మధ్య 2018 నుంచి జరిగిన గత 7 వన్డేల్లో భారత్ 6 గెలవగా, 1 మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇరు జట్ల మధ్య మొత్తం 15 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. వరుసగా గత 4 మ్యాచ్‌లలో మనదే పైచేయి. 2022లో ఓటమి తర్వాత రెండు ఫార్మాట్‌లు కలిపి మన జట్టు వరుసగా 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆధిపత్యంపై సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
‘భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లకు ‘వైరం’ అనే మాటను ఇకపై వాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఇరు జట్ల మధ్య వైరం అనాల్సినంతగా పోటీ ఎక్కడ ఉంది. నా అభిప్రాయం ప్రకారం రెండు జట్ల మధ్య 15–20 మ్యాచ్‌లు జరిగి ఇద్దరూ 7–7తో సమంగా ఉండి లేదా 8–7తో కాస్త ఆధిక్యంలో ఉంటే సమ ఉజ్జీల సమరం అని చెప్పవచ్చు. కానీ సరిగ్గా అంకెలు గుర్తు లేవు కానీ ప్రస్తుతం ఇది 13–0 లేదా 10–1గా ఉంది. కాబట్టి ఇకపై ఇది అసలు పోటీనే కాదు’ అని సూర్య ఘాటుగా వ్యాఖ్యానించాడు.
దూబే స్పెల్ కీలక మలుపు...
పాక్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామ సమయంలో ఆట మలుపు తిరిగిందని సూర్యకుమార్ అన్నాడు. సాధారణంగా పవర్‌ప్లే తర్వాత ఆట మారుతుందని, కానీ 10–17 ఓవర్ల మధ్య తాము పాక్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యామని కెపె్టన్ చెప్పాడు. ఈ 8 ఓవర్లలో పాక్ 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా నా దృష్టిలో శివమ్ దూబే స్పెల్ ఆటను మలుపు తిప్పింది. ఈసారి అతను తనకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో దూబే బౌలింగ్‌లో బాగా శ్రమించాడు. కొత్త బంతితో కూడా సాధన చేశాడు.
ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో అతను వచ్చాడు’ అని సూర్య చెప్పాడు. మరోవైపు నీరు–నిప్పులాంటి గిల్, అభిషేక్ భాగస్వామ్యంపై కూడా సారథి ప్రశంసలు కురిపించాడు. ‘అభిషేక్ బ్యాటింగ్ శైలి అలాగే ఉంటుంది. పవర్‌ప్లే తర్వాత కూడా అతను తగ్గడు. గిల్ ఎలా ఆడతాడో కూడా అందరికీ తెలుసు. ఏ రకంగానైనా అతను పరుగులు రాబట్టగలడు. మైదానం బయట కూడా మంచి స్నేహం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో వీరిద్దరు చూపించారు. నీరు–నిప్పులాంటి వీరిద్దరు కలిసి ఆడుతుంటే సమన్వయానికి ఒక కనుసైగ చాలు’ అని కెపె్టన్ వ్యాఖ్యానించాడు.
‘వాళ్లు అలా చేయడం నచ్చలేదు’
భారత్, పాక్ మ్యాచ్‌లలో సహజంగా కనిపించే కవ్వింపులు, మాటల యుద్ధం ఆదివారం మ్యాచ్‌లో కూడా కనిపించింది. వేర్వరు సందర్భాల్లో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్‌లకు హారిస్ రవూఫ్, షాహిన్ అఫ్రిదిలతో వివాదం రేగింది. దీనిపై మ్యాచ్ తర్వాత అభిషేక్ స్పష్టతనిచ్చాడు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తన వల్లే తాను స్పందించాల్సి వచి్చందని అతను చెప్పాడు. ‘ఎలాంటి కారణం లేకుండా వారు మాపైకి దూసుకొచ్చి కవి్వంచే ప్రయత్నం చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు.
నేను దూకుడుగా ఆడి చెలరేగడమే దానికి సరైన మందు అని భావించాను’ అని అభిషేక్ వెల్లడించాడు. తన బాల్య మిత్రుడు గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, అది జట్టు విజయానికి కారణం కావడం పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేశాక తాను గన్ షూటింగ్ తరహాలో చేసిన సంబరంలో ఎలాంటి తప్పూ లేదని పాక్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అన్నాడు. ‘ఆ క్షణంలో వచి్చన ఆలోచనతోనే నేను గన్ తరహాలో బ్యాట్‌తో అలా చేశాను. నేను సాధారణంగా 50 దాటినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోను. అప్పటికప్పుడు నాకు అలా చేయాలనిపించింది. జనం దాని గురించి ఎలా ఆలోచిస్తారనేది నాకు అనవసరం. దానిని నేను పట్టించుకోను’ అని ఫర్హాన్ స్పష్టం చేశాడు.