మూడో వన్డే కూడా భారత్‌దే
3–0తో అఫ్గానిస్తాన్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్
యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీ
ప్రసిధ్ కృష్ణకు 5 వికెట్లు
భారత జట్టు ముందు అఫ్గానిస్తాన్ ఇంకా పసికూన మాత్రమే అని మరోసారి నిరూపితమైంది. సొంతగడ్డపై ఏకైక టెస్టును మూడు రోజుల్లో ముగించిన టీమిండియా మూడు వన్డేల్లో కూడా అఫ్గాన్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అలవోక విజయాలతో సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి పోరులో ముందుగా ప్రసిధ్ కృష్ణ ధాటికి అఫ్గాన్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా... ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రోహిత్ దూకుడుతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది.
చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3–0తో గెలుచుకుంది. శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (131 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా... అజ్మతుల్లా ఒమర్జాయ్ (56 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 19.3 ఓవర్లలో 105 పరుగులు జోడించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (5/23) కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శనతో అఫ్గాన్‌ను కుప్పకూల్చాడు. అనంతరం భారత్ 28.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 110 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటగా, రోహిత్ శర్మ (69 బంతుల్లో 79; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 23.1 ఓవర్లలో 170 పరుగులు జత చేయడంతోనే భారత్ విజయం ఖాయమైంది. గతంలో ఏ భారత బ్యాటర్‌కు సాధ్యం కాని రీతిలో జైస్వాల్ తన తొలి 6 వన్డేల్లోనే రెండు సెంచరీలు సాధించడం విశేషం. శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
(సి) రోహిత్ (బి) ప్రసిధ్
స్వింగ్, అదనపు బౌన్స్‌కు సహకరించిన పిచ్‌పై ప్రసిధ్ చెలరేగిపోయాడు. తన తొలి బంతికే గుర్బాజ్ (5)ను అవుట్ చేసిన అతను ఆ తర్వాత రహ్మత్ షా (5), ఇబ్రహీమ్ (11)లను కూడా వెనక్కి పంపించాడు. ఈ మూడు క్యాచ్‌లను మొదటి స్లిప్‌లోనే ఒకే తరహాలో రోహిత్ శర్మనే అందుకోవడం విశేషం. అనంతరం దార్విష్ (1)ను కూడా అవుట్ చేసిన ప్రసిధ్ తన తొలి స్పెల్‌ను 5–2–6–4తో ముగించాడు. 36/4 వద్ద హష్మత్, అజ్మత్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ అఫ్గాన్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ముందుగా హష్మత్ 64 బంతుల్లో, అజ్మత్ 55 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే అజ్మత్‌ను ప్రిన్స్ అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, ఆ తర్వాత జట్టు తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు చేజార్చుకుంది. మరో వైపు పట్టుదలగా నిలిచిన హష్మత్ సెంచరీ అందుకోవడంలో (128 బంతుల్లో) సఫలమయ్యాడు. హష్మత్‌ను అవుట్ చేసి ప్రసిధ్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోవడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
రోహిత్ హాఫ్ సెంచరీ...
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో హష్మత్ మూడుసార్లు పిచ్‌పై పరుగెత్తడంతో లభించిన 5 పెనాల్టీ పరుగులతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అజ్మల్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు బాదడంతో పాటు 2 నోబాల్, 2 వైడ్‌లతో తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరు 23/0కు చేరింది. ఆ తర్వాత జైస్వాల్, రోహిత్ అలవోకగా దూసుకుపోయారు. తనకు లభించిన మరో అవకాశాన్ని జైస్వాల్ సద్వినియోగం చేసుకోగా, చక్కటి షాట్లతో రోహిత్ తన స్థాయిని మళ్లీ ప్రదర్శించాడు.
10 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఫరీద్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 38 బంతుల్లోనే జైస్వాల్, 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు పుల్ షాట్‌తో డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ వెనుదిరిగాడు. అయితే జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. నబీ ఓవర్లో సిక్స్‌తో సెంచరీ (83 బంతుల్లో) పూర్తి చేసుకున్న జైస్వాల్...అదే ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
160
మూడు ఫార్మాట్‌లలో కలిపి అఫ్గానిస్తాన్‌తో 18 సార్లు తలపడిన భారత్ 16 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పటి వరకు అఫ్గాన్ చేతిలో ఓడని ఐసీసీ శాశ్వత సభ్యత్వ జట్టు భారత్ మాత్రమే.
స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 5; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 11; రహ్మత్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 5; హష్మతుల్లా (సి) అయ్యర్ (బి) ప్రసిధ్ 102; దార్విష్ (సి) అయ్యర్ (బి) ప్రసిధ్ 1; అజ్మతుల్లా (సి) ప్రసిధ్ (బి) ప్రిన్స్ 50; నబీ (బి) గుర్నూర్ 21; రషీద్ (సి) ప్రిన్స్ (బి) దూబే 5; ఘజన్‌ఫర్ (రనౌట్) 1; ఫరీద్ (రనౌట్) 0; రహమాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–5, 2–26, 3–28, 4–36, 5–141, 6–198, 7–205, 8–206, 9–206, 10–218. బౌలింగ్: గుర్నూర్ 8–0–49–1, ప్రసిధ్ 8.2–2–23–5, ప్రిన్స్ 7–0–38–1, నితీశ్ రెడ్డి 6–0–42–0, హర్ష్ దూబే 7–0–38–1, సుందర్ 8–2–23–0.
భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 110; రోహిత్ (సి) (సబ్) సాదిఖుల్లా (బి) నబీ 79; అయ్యర్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (28.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 224. వికెట్ల పతనం: 1–170. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–26–0, రహమాన్ 4–0–21–0, ఫరీద్ 5–0–55–0, ఘజన్‌ఫర్ 3–0–15–0, రషీద్ 7–0–53–0, నబీ 7.4–1–47–1.


