బవుమా (పాత ఫొటో)
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను విజేతగా నిలిపి ఘనత కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) సొంతం. ఇంగ్లండ్ వేదికగా పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి బవుమా బృందం ‘ఐసీసీ గద’ను గెలుచుకుంది. అయితే, ఈ మోగా ఫైనల్ తర్వాత ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా బవుమా టెస్టులకు దూరమయ్యాడు.
ఈ క్రమంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా- ‘ఎ’ తరఫున రెడ్‌బాల్ క్రికెట్‌లో బవుమా పునరాగమనం చేశాడు. భారత్- ‘ఎ’ (IND A vs SA A)తో గురువారం మొదలైన రెండో అనధికారిక టెస్టు తుదిజట్టులో ఈ కెప్టెన్ సాబ్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు.
గోల్డెన్ డకౌట్
శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా... అకెర్‌మాన్ సారథ్యంలోని ఈ టీమ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బవుమా.. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.
ధ్రువ్ జురేల్ వీరోచిత అజేయ శతకం
కాగా సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో సహచరులు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... ధ్రువ్ జురేల్ పట్టుదలతో ఆడి వీరోచిత అజేయ శతకం సాధించాడు. జురేల్ (175 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పుణ్యమాని... గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది.
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ కెప్టెన్ అకెర్‌మాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 77.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 19; 3 ఫోర్లు), సాయి సుదర్శన్ (52 బంతుల్లో 17; 3 ఫోర్లు) క్రీజులో కుదురుకుంటున్న దశలో అవుటయ్యారు.
రాణించిన కుల్దీప్, సిరాజ్
ఒకదశలో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును జురేల్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20; 1 ఫోర్)తో కలిసి జురేల్ 79 పరుగులు జత చేసి భారత స్కోరును 200 దాటించాడు.
కుల్దీప్ అవుటయ్యాక సిరాజ్ (31 బంతుల్లో 15; 3 ఫోర్లు)తో కలిసి జురేల్ 34 పరుగులు జోడించాడు. 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జురేల్... 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో సెంచరీ మైలురాయిని దాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వాన్ వురెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా... సుబ్రాయెన్, మోరెకిలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి.
చెలరేగిన భారత బౌలర్లు
ఇక రెండో రోజు ఆటలో భాగంగా తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 44 ఓవర్ల ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది.
భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ప్రొటిస్ బ్యాటర్లలో కెప్టెన్ అకెర్‌మాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చదవండి: అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్


