IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌ | IND A vs SA A 2nd Unofficial Test: Rishabh Pant Injured Retires Hurt | Sakshi
Sakshi News home page

IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌

Nov 8 2025 11:21 AM | Updated on Nov 8 2025 11:44 AM

IND A vs SA A 2nd Unofficial Test: Rishabh Pant Injured Retires Hurt

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్‌ తగిలింది. భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.

ఇందుకు సన్నాహకంగా భారత్‌- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతున్నాయి. ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడ్డ పంత్‌ భారత్‌- ‘ఎ’ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్‌ సేన గెలుపొందింది.

ధ్రువ్‌ జురెల్‌ అజేయ శతకం
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్‌ అయింది. ధ్రువ్‌ జురెల్‌ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.

అయితే, తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పంత్‌ గాయపడ్డాడు. సఫారీ పేసర్‌ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్‌ పంత్‌ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్‌లో అవుటయ్యాడు.

34 పరుగుల స్వల్ప ఆధిక్యం
ఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 78 పరుగులు చేసింది.

ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (60 బంతుల్లో 27) వికెట్‌ను భారత్‌ కోల్పోగా.. పంత్‌ క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్‌కు రెండుసార్లు గాయమైంది. 

రెండుసార్లు బంతి బలంగా తాకడంతో
మొరేకి బౌలింగ్‌లో తొలుత పంత్‌ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్‌ మొదలు కానుండగా.. పంత్‌ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో భారత్‌ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement