India vs England, 3rd Test: ‘‘హైదరాబాద్‌లోనే 500 అందుకోవాలని భావించాం. కానీ కుదరలేదు. పోనీ.. వైజాగ్‌లోనైనా సాధిద్దామనుకుంటే.. అదీ జరుగలేదు. అందుకే.. 499 వద్ద ఉన్నపుడే నేను స్వీట్లు కొనుక్కొచ్చి ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టాను.
ఆ తర్వాత 500 మార్కు అందుకున్నాం. అయితే, 500- 501 మధ్య చాలా జరిగింది. మా జీవితకాలంలో ఆ 48 గంటలు అత్యంత సుదీర్ఘమైనవి. ఇదంతా ఆ ప్రత్యేకమైన 500 గురించి, ఆ 499 గురించే! అద్భుతమైన విజయం.
అత్యద్భుతమైన వ్యక్తి. నిన్ను చూసి నేను ఎంత గర్విస్తున్నానో నాకే తెలుసు’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనయ్యారు.
500 వికెట్ల క్లబ్‌లో
టెస్టు క్రికెట్‌లో భర్త సాధించిన అద్వితీయమైన విజయం, అందుకున్న అరుదైన మైలురాయిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.
Moment when Ravi Ashwin reached his 500th Test wicket. 🐐 pic.twitter.com/MUlGtPgm9c
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024
తన 98వ టెస్టు మ్యాచ్‌లో అశూ ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్(అనిల్ కుంబ్లే-619)గా నిలిచాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా రాజ్‌కోట్‌లో అశూ ఈ మైలురాయిని అందుకున్న తర్వాత అర్ధంతరంగా జట్టును వీడాడు.
తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా చెన్నైకి తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటకు దూరమైన అశూ.. నాలుగోరోజు(ఆదివారం) మళ్లీ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే(16)ను బౌల్డ్ చేసి 501వ వికెట్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
మానసిక వేదన
ఈ నేపథ్యంలో తల్లి అనారోగ్యం సందర్భంగా అశ్విన్ పడిన మానసిక వేదన.. అదే సమయంలో ఆట పట్ల అంకిత భావంతో అతడు తిరిగి జట్టుతో చేరిన తీరును ప్రస్తావిస్తూ అతడి సతీమణి ప్రీతి ఈ మేరకు భావోద్వేగపూరిత క్యాప్షన్‌తో.. అశ్విన్ ఫొటోను పంచుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 434 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది.
చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా?


