రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్‌ స్కిల్‌ చూడాల్సిందే! | Sakshi
Sakshi News home page

#Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్‌.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్‌ చూశారా?

Published Mon, Feb 19 2024 10:37 AM

Ind vs Eng 3rd Test Dhruv Jurel Inflicts Stunning RunOut Breaks Internet Video - Sakshi

India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్‌ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది.

ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్‌ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్‌ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ బ్యాటింగ్‌(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్‌, ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(4)ను రనౌట్‌ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్‌.. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్‌ సిరాజ్‌ బాల్‌ను ఆపాడు.

ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్‌ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్‌ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్‌ వేసిన బంతిని అందుకున్న వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు.

రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్‌ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్‌ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్‌ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్‌ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

చదవండి: సర్ఫరాజ్‌ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి)

Advertisement
 
Advertisement