
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బుమ్రాకు విశ్రాంతి
తాను టాస్ గెలిస్తే తప్పక తొలుత బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. ఇక రెండో టెస్టులో తాము మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు గిల్ వెల్లడించాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చామని.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.
ఆ ఇద్దరిపై వేటు
కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో పాటు.. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌పై వేటు పడింది. శార్దూల్ తొలి టెస్టులో కేవలం ఐదు పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
కరుణ్ నాయర్‌కు రెండో అవకాశం
మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో ముప్పై పరుగులు చేయగలిగాడు. అయితే, సాయి సుదర్శన్‌తో పాటే విఫలమైన సీనియర్ కరుణ్ నాయర్‌పై మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. అతడికి రెండో ఛాన్స్ ఇచ్చింది. కాగా కరుణ్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఫలితంగా ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు తుదిజట్లు
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు