చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు | Richa Ghosh Becomes 1st Player In World To Register Incredible Feat, Check Full Story For Details | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్‌.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు

Jul 2 2025 9:49 AM | Updated on Jul 2 2025 10:17 AM

Richa Ghosh Becomes 1st Player In World To Register Incredible Feat

భారత క్రికెటర్‌ రిచా ఘోష్‌ (Richa Ghosh) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో రెండో టీ20 (England Women vs India Women) సందర్భంగా రిచా ఘోష్‌ ఈ ఘనత సాధించింది.

కాగా భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో ఆతిథ్య జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌.. తాజాగా రెండో టీ20లోనూ అదరగొట్టింది.

బ్రిస్టల్‌ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో నాట్‌ సీవర్‌-బ్రంట్‌ బృందాన్ని ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సంపాదించింది.

దంచికొట్టిన అమన్‌జోత్‌, రిచా
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (13), షెఫాలీ వర్మ (3) నిరాశపరిచినా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అద్భుత అర్ధ శతకం (41 బంతుల్లో 63)తో మెరిసింది.

ఇక రెండో టీ20తో తిరిగి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1) తీవ్రంగా నిరాశపరచగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌’ అమన్‌జోత్‌ కౌర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ దంచికొట్టారు. అమన్‌జోత్‌ 40 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు.. రిచా ఘోష్‌ 20 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో నాటౌట్‌గా ఉంది.

తొలి మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు
ఈ క్రమంలోనే రిచా అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. 140కి పైగా స్ట్రైక్‌రేటుతో ఈ ఘనత సాధించింది. తద్వారా మహిళల అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో (T20 Format) ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది.

ఫాస్టెస్ట్‌ 1000.. రెండో ప్లేయర్‌గా
అదే విధంగా.. ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌లో బంతుల పరం (702)గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్‌గానూ రిచా ఘోష్‌ నిలిచింది. అంతకుముందు ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌కు చెందిన లూసీ బార్నెట్‌ 700 బంతుల్లో ఈ ఘనత సాధించింది.

కాగా పదహారేళ్ల వయసులో 2020లో రిచా టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసింది. ఇప్పటికి 64 మ్యాచ్‌లలో కలిపి 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. 21 ఏళ్ల రిచా 37 వన్డేల్లో 800, రెండు టెస్టు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించింది.

ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించిన భారత్‌
ఇక ఇంగ్లండ్‌తో రెండో టీ20 విషయానికొస్తే.. భారత్‌ విధించిన 182 లక్ష్యాన్ని ఛేదించడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టామీ బీమౌంట్‌ హాఫ్‌ సెంచరీ (54) చేయగా.. మిగతా వారిలో ఎమీ జోన్స్‌ (32), సోఫీ ఎక్లిస్టోన్‌ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. స్నేహ్‌ రాణా- రాధా యాదవ్‌, స్మృతి మంధాన- రిచా ఘోష్‌ జోడీలు రెండు రనౌట్లలో భాగమయ్యాయి.

అత్యుత్తమ స్ట్రైక్‌రేటుతో మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు
🏏రిచా ఘోష్‌ (ఇండియా)- 143.11 స్ట్రైక్‌రేటుతో 1029 రన్స్‌
🏏లూసీ బార్నెట్‌ (ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌)- 139.69 స్ట్రైక్‌రేటుతో 1172 రన్స్‌
🏏తాహిలా మెగ్రాత్‌ (ఆస్ట్రేలియా)- 132.94 స్ట్రైక్‌రేటుతో 132.94 రన్స్‌
🏏క్లో టైరాన్‌ (సౌతాఫ్రికా)- 132.81 స్ట్రైక్‌రేటుతో 1283 రన్స్‌
🏏అలీసా హేలీ (ఆస్ట్రేలియా)- 129.79 స్ట్రైక్‌రేటుతో 3208 రన్స్‌

చదవండి: సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్‌లో టీమిండియా యువ సంచలనం ఆల్‌రౌండ్‌ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement