ఆస్ట్రేలియాతో ఐదో టీ20 (IND vs AUS 5th T20I)లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం నాటి నిర్ణయాత్మక మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సూర్యకుమార్ సేన సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో కీలక టీ20లో తుదిజట్టు విషయంలో టీమిండియా యాజమాన్యం మార్పులు చేస్తుందా? లేదంటే విన్నింగ్ టీమ్‌నే కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
2-1తో భారత్ ముందంజ
భారత్- ఆసీస్ మధ్య కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో ఆతిథ్య కంగారూ జట్టు చేతిలో ఓడిన సూర్యకుమార్ సేన.. హోబర్ట్, క్వీన్స్‌లాండ్ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించింది. తద్వారా ఆధిక్యాన్ని 2-1కు పెంచుకుంది.
ఇక మూడు, నాలుగో టీ20లలో టీమిండియా ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని జట్టులో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మను కొనసాగించిన మేనేజ్‌మెంట్.. తిలక్ వర్మ, శివం దూబే (Shivam Dube), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రాలను ఆడించింది.
వారం తిరగకముందే
విమర్శల వర్షం వెల్లువెత్తడంతో ఈ రెండు మ్యాచ్‌ల నుంచి యువ పేసర్ హర్షిత్ రాణాను తప్పించినప్పటికీ.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్‌కు చోటిచ్చి సంజూపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. ఐదో టీ20 ముగియగానే స్వదేశానికి చేరుకోనున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. వారం తిరగకముందే మళ్లీ బిజీ కానుంది.
బుమ్రాకు విశ్రాంతి?
ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే విధంగా.. టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇస్తారనుకున్నా.. ఇంత వరకు అతడు ఈ సిరీస్‌లో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. కాబట్టి కీలక మ్యాచ్‌లో ఓపెనర్‌గా సత్తా చాటేందుకు గిల్ సిద్ధంగా ఉన్నందున అతడిని పక్కనపెట్టే అవకాశం లేదు.
సంజూకు మరోసారి మొండిచేయి
ఇక మిడిల్ ఆర్డర్‌లో టీ20 స్పెషలిస్టులు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబేలతో పాటు.. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాలు నిలబెట్టుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. వికెట్ కీపర్‌గా ఈసారి కూడా జితేశ్ శర్మకే నాయకత్వ బృందం ఓటు వేసే అవకాశం ఉంది.
కాబట్టి సంజూకు మరోసారి మొండిచేయి తప్పదు. ఇక ఇప్పటి వరకు ఆసీస్‌తో తాజా సిరీస్‌లో రింకూ సింగ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అదే విధంగా.. గాయం వల్ల సిరీస్ ఆరంభం నుంచే జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి.
హర్షిత్ రాణా జట్టులోకి!
సిరీస్ డిసైడర్ కావున రింకూ, ఫిట్‌గా మారిన నితీశ్ రెడ్డిలను.. మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్‌లో ఆడించే రిస్క్ చేయకపోవచ్చు. ఇక లోయర్ ఆర్డర్‌లో బుమ్రాకు గనుక విశ్రాంతినిస్తే.. హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. ఇప్పటికే మూడు, నాలుగో టీ20లలో సత్తా చాటిన అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగడం ఖాయమే!.. అన్నట్లు భారత్- ఆసీస్ మధ్య ఐదో టీ20కి స్వల్ప వర్ష సూచన ఉంది.
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం


