
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో (India A vs Australia A) భారత-ఏ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) చెలరేగిపోయాడు. 82 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆర్య మరో ఓపెనర్, పంజాబ్ కింగ్స్ సహచరుడు ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో (53 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 123 బంతుల్లో 135 పరుగులు జోడించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 31.4 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 214/2గా ఉంది. ఆర్య, ప్రభ్‌సిమ్రన్ ఔట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36), రియాన్ పరాగ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఇవాల్టికి వాయిదా పడింది.
టీమిండియా దిశగా అడుగులు..
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరుపు శతకాలు బాది, ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్న ప్రియాంశ్.. తన తొలి ఐపీఎల్ ఎడిషన్‌లోనే (2025) చెలరేగిపోయాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఈ సీజన్‌లో ప్రియాంశ్ సీఎస్‌కేపై 42 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రకంపనలు సృష్టించాడు. గత సీజన్‌లో ప్రియాంశ్ మొత్తంగా 475 పరుగులు సాధించి, ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్-ఏపై సెంచరీతో ప్రియాంశ్ అడుగులు టీమిండియావైపు పడుతున్నాయనడంలో సందేహం లేదు.
తొలి మ్యాచ్‌లోనే..!
ప్రియాంశ్ భారత్-ఏ తరఫున ఆడటం ఇదే తొలిసారి. ఆసీస్-ఏతో సిరీస్‌కు అతను కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో జరుగబోయే మిగతా రెండు వన్డేలకు ప్రియాంశ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేస్తాడు.
కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో చేజిక్కించుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ నడుస్తుంది. మిగతా రెండు వన్డేలు అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు