
టీమిండియా నయా విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (ICC T20I Rating Points) సాధించిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్ 2025లో అదిరిపోయే ప్రదర్శనల తర్వాత అభిషేక్ నంబర్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకున్నాడు.
ఇవాళ (అక్టోబర్ 1) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ రేటింగ్ పాయింట్లు 931కు చేరుకున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ ఇన్ని రేటింగ్ పాయింట్లు లేవు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ పేరిట ఉండేది. మలాన్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 919 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
భారత్ తరఫున అభిషేక్‌కు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లను సూర్యకుమార్ యాదవ్ సాధించాడు. స్కై తన కెరీర్‌లో అత్యుత్తమంగా 912 రేటింగ్ పాయింట్లు సాధించాడు. స్కై తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
అత్యధిక ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన టీ20 బ్యాటర్లు (టాప్-5)
అభిషేక్ శర్మ- 931
డేవిడ్ మలాన్- 919
సూర్యకుమార్ యాదవ్- 912
విరాట్ కోహ్లి- 909
ఆరోన్ ఫించ్- 904
కాగా, తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ అత్యుత్తమ ప్రదర్శనలతో చెలరేగాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి 200 స్ట్రయిక్‌రేట్‌తో 44.86 సగటున 314 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు