BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు! | IND vs AFG: BCCI Breaks Silence On Hardik Pandya Replacement | Sakshi
Sakshi News home page

BCCI: అతడు దూరమయ్యాడు.. నితీశ్‌ రెడ్డి ఉన్నాడుగా!

Jun 11 2026 4:47 PM | Updated on Jun 11 2026 4:56 PM

IND vs AFG: BCCI Breaks Silence On Hardik Pandya Replacement

అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్‌పూర్‌ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సహా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ విమానంలో బయల్దేరారు.

 జైస్వాల్‌కు చోటు
ఇక లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్‌ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ తెచ్చుకున్నాడు.

రోహిత్‌ పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం ఫిట్‌నెస్‌ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.

అతడు జట్టుకు దూరమయ్యాడు!
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.

అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.

నితీశ్‌ రెడ్డి ఉన్నాడుగా
కాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌, ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్‌మెంట్‌ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్‌పూర్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్‌ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. 

చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

Advertisement
 
Advertisement
Advertisement