భారత్‌, పాక్‌ మధ్య ఐసీసీ మధ్యవర్తిత్వం | ICC Working Behind The Scenes To Convince PCB For Hybrid Model | Sakshi
Sakshi News home page

Champions Trophy: భారత్‌, పాక్‌ మధ్య ఐసీసీ మధ్యవర్తిత్వం

Nov 19 2024 4:57 PM | Updated on Nov 19 2024 5:06 PM

ICC Working Behind The Scenes To Convince PCB For Hybrid Model

ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్దత నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) భారత్‌, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది. మెగా టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ పాక్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఐసీసీ తెర వెనుక పావులు కదుపుతుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పాల్గొనకపోతే ఎదురయ్యే నష్టాలను ఐసీసీ పాక్‌కు వివరిస్తుంది.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత్‌ పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీని తటస్థ వేదికపై నిర్వహిస్తేనే తాము పాల్గొంటామని భారత్‌ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఛాంపియన్స్‌ టోర్నీని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే నిర్వహించాలని పాక్‌ భీష్మించుకుని కూర్చుంది.

ఈ టోర్నీ కోసం తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, అలాగే టోర్నీ నిర్వహణ కోసం​ భారీగా నిధులు సమకూర్చామని పాక్‌ చెబుతుంది. టోర్నీ నిర్వహణ విషయంలో ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పాక్‌ కోరుతుంది. ఒకవేళ భారత్‌ ఈ టోర్నీలో పాల్గొనపోతే వేరే దేశానికి అవకాశం కల్పించాలని పాక్‌ అంటుంది. టోర్నీ షెడ్యూల్‌ను వీలైనంత త్వరలో విడుదల చేయాలని పాక్‌ ఐసీసీని కోరుతుంది.

వాస్తవానికి ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను నవంబర్‌ 12నే విడుదల చేయాల్సి ఉండింది. అయితే భారత్‌, పాక్‌ మధ్య పంచాయితీ నడుస్తుండటంతో షెడ్యూల్‌ విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

పాక్‌ ఒప్పుకోకపోతే వేదిక మారనుందా..?
హైబ్రిడ్‌ మోడల్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు పాక్‌ ఒప్పుకోకపోతే వేదికను దక్షిణాఫ్రికాకు మార్చాలని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వేదికను దక్షిణాఫ్రికాకు షిప్ట్‌ చేస్తే పాక్‌ పాల్గొంటుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి భారత్‌ తాము ఆడబోయే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని కోరుతుంది. మిగతా మ్యాచ్‌లన్నిటినీ యధాతథంగా పాక్‌లోనే నిర్వహించుకోవచ్చని భారత్‌ అంటుంది. ఇందుకు పాక్‌ ఒప్పుకోవడం లేదు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement