మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
భారత్‌ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్‌లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్‌కు తరలించి భారత్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.
అయితే తొందరగా మ్యాచ్‌ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్‌కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్‌ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్‌మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్‌లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.


