ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరిగిన కీలక సమరంలో బంగ్లాదేశ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రేణుకా సింగ్ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్ లేకుండా 11 పరుగులిచ్చింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో జుయారియా ఫెర్దోస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్ అక్తర్ (10 రిటైర్డ్ ఔట్), షోర్నా అక్తర్ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్ (4), రీతూ మోనీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్ డకౌటైంది. రబేయా ఖాన్, మరుఫా అక్తర్ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.
షఫాలీ విధ్వంసం
137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు.
మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది.
గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి.
మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి.


