దీప్తి మాయాజాలం.. పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ | ICC Womens T20 WC 2026, Team India Beat Pakistan By 64 Runs, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

దీప్తి మాయాజాలం.. పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Jun 14 2026 10:38 PM | Updated on Jun 15 2026 2:25 PM

ICC Womens T20 WC 2026: Team india beat Pakistan

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ  జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) మంధనకు సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. 

మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

దీప్తి మాయాజాలం
అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. దీప్తి శర్మ మాయాజాలానికి (4-0-10-5) కుదేలైంది. ఆమె శ్రీ చరణి (4-0-21-3), షఫాలీ వర్మ (3-0-22-1) కూడా తోడవ్వడంతో పాక్‌ 17 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసింది. 

ఆ జట్టు తరఫున ఓపెనర్‌ మునీబా అలీ (41) మాత్రమే ఓ మోస్తరు స్కోర్‌ సాధించింది. మిగతా ప్లేయర్లలో గుల్‌ ఫెరోజా (12), ఆయేషా జాఫర్‌ (2), ఆలియా రియాజ్‌ (18) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు సాధించగా.. సైరా జబీన్‌ (2), నతాలియా పర్వేజ్‌ (7), రమీన్‌ షమీమ్‌ (4), నష్రా సంధు (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌ డకౌట్లయ్యారు.  ఈ గెలుపుతో భారత్‌ తమ ప్రపంచకప్‌ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement