T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ | ICC Punishes Pakistan Days After Womens T20 WC Loss To India | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

Jun 16 2026 8:22 PM | Updated on Jun 16 2026 8:34 PM

ICC Punishes Pakistan Days After Womens T20 WC Loss To India

పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం మేర కోత విధించింది. ఇంగ్లండ్‌ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ జూన్‌ 12న మొదలైన సంగతి తెలిసిందే.

భారత్‌ ఘన విజయం
పన్నెండు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో.. ఆయా జట్లను గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌-‘బి’గా విభజించారు. గ్రూప్‌- ‘ఎ’లో ఉన్న భారత్‌- పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడ్డాయి. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతి మంధాన అర్ధ శతకం (68) సాధించగా.. రిచా ఘోష్‌ మెరుపులు (17 బంతుల్లో 34) మెరిపించింది.

పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సైదా ఇక్బాల్‌ రెండేసి వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ మహిళా జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్‌ అయింది.

దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చి
భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. శ్రీచరణి మూడు, షఫాలీ వర్మ ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ ఐసీసీ పాక్‌ జట్టుకు శిక్ష విధించింది.

జరిమానా విధించిన ఐసీసీ
నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. జరిమానా వేసింది. ఒక ఓవర్‌ ఆలస్యంగా వేసినందున మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోతతో సరిపెట్టింది. కాగా పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టును ఎదుర్కోనుంది. గ్రూప్‌-ఎలో భాగంగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్‌ వేదిక.

చదవండి: వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement