‘సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే’ | Akash Chopra Breaks Silence On Mohammed Shami Return After Bhuvneshwar Kumar India Comeback, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే’

Oct 9 2026 9:53 AM | Updated on Oct 9 2026 10:29 AM

I have spoken to selectors: Ex India opener huge claim on Shami Return

PC: ICC X

స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా.. తదుపరి న్యూజిలాండ్‌ గడ్డ మీద అడుగుపెట్టనుంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు, ఐదు వన్డేల సిరీస్‌లు ఆడనుంది.

స్వింగ్‌ సుల్తాన్‌ పునరాగమనం
ఈ పర్యటనలో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగనుండగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఇందులో వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ స్వింగ్‌ సుల్తాన్‌ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.

అగార్కరే అడ్డుపడ్డాడా?
గత రెండేళ్లుగా దేశీ క్రికెట్‌, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనల కారణంగా భువీకి సెలక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే, చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ పదవీ కాలం ముగిసిన వెంటనే ఈ పేస్‌ బౌలర్‌ జట్టులోకి రావడంతో.. ఇన్నాళ్లూ అగార్కరే భువీ రాకుండా అడ్డుపడ్డాడనే ప్రచారం జరిగింది.

ఇక భువీ రీఎంట్రీ నేపథ్యంలో మరో వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కూడా టీమిండియాలో పునరాగమనం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగార్కర్‌ నిష్క్రమణతో ఈ బెంగాల్‌ బౌలర్‌కు కూడా మంచి రోజులు వస్తాయంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు.

అగార్కర్‌ వెళ్లిపోయినంత మాత్రాన 
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. అగార్కర్‌ వెళ్లిపోయినంత మాత్రాన షమీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ...

‘‘భువీ వచ్చాడు కాబట్టి.. షమీ కూడా జట్టులోకి తిరిగి వచ్చేస్తాడని చాలా మంది అంటున్నారు. అజిత్‌ అగార్కర్‌ వెళ్లిన తర్వాతే ఇది జరిగింది కాబట్టి.. షమీకి కూడా మార్గం సుగమం అయిందని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు.

గుడ్డిగా తలూపుతారని అనుకుంటే పొరపాటే
ఒకే ఒక్క సెలక్టర్‌ కావాలనే కొంతమంది ఆటగాళ్లు తిరిగి రాకుండా అడ్డుకున్నాడని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. చీఫ్‌ సెలక్టర్‌ ఏది చెబితే మిగతా సెలక్టర్లు కూడా అందుకు గుడ్డిగా తలూపుతారని అనుకుంటే పొరపాటే.

నేను ఇప్పటికే సెలక్టర్లతో మాట్లాడాను. వారంతా ఒకే తాటి మీద ఉన్నారు. కాబట్టి చైర్మన్‌ ఏది చెబితే వాళ్లు అదే వింటారనుకోవడం ముమ్మాటికీ తప్పే. షమీ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుంది.

అదే ఆఖరి అవకాశం అవుతుంది
ఒకవేళ షమీని తిరిగి తీసుకోవాలంటే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అతడు జట్టులోకి వస్తాడు. అలా అయితేనే అతడు వన్డే వరల్డ్‌కప్‌-2027 ప్రణాళికల్లో ఉన్నట్లు అవుతుంది. ఒకవేళ కివీస్‌ టూర్‌కు షమీ ఎంపిక కాకపోతే.. ఆ తర్వాత అతడు తిరిగి వచ్చే పరిస్థితే ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.  

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (వన్డే) ఫైనల్‌ సందర్భంగా షమీ టీమిండియా తరఫున చివరిగా మ్యాచ్‌ ఆడాడు.  మొత్తంగా ఇప్పటికి 108 వన్డేలు ఆడిన షమీ.. 5.58 ఎకానమీ రేటుతో 206 వికెట్లు కూల్చాడు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌వర్మ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబే, నితీశ్‌కుమార్‌ రెడ్డి, నమన్‌ ధీర్, ప్రిన్స్‌ యాదవ్, మయాంక్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, భువనేశ్వర్‌ కుమార్, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: వినోద్‌ కాంబ్లీ గతి ఏమైందో తెలుసు కదా!: టీమిండియా దిగ్గజం
అప్పుడు ఐదు ఎకరాల భూమి.. ఇప్పుడు 3 ఖరీదైన అపార్టుమెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement