వైభవ్ సూర్యవంశీ (PC: X)
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్.. భారత అండర్-19 జట్టు తరఫునా అద్భుతాలు చేశాడు. యూత్ క్రికెట్‌లో ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర శతకాలు బాది తానేంటో నిరూపించుకున్నాడు.
పదిహేనేళ్ల వయసులోనే అరంగేట్రం
ఇక అండర్-19 వరల్డ్‌కప్-2025 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి.. భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏకంగా 776 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
ప్రశంసల వర్షం
ఈ పరిణామాల నేపథ్యంలో కేవలం పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. నిలకడగా రాణిస్తూ.. టీ20 జట్టు ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు ఈ బిహారీ పిల్లాడు.
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తదుపరి సూపర్ స్టార్ అతడేనంటూ దేశీ, విదేశీ దిగ్గజ క్రికెటర్లు అతడిని కొనియాడుతున్నారు. అయితే, టీమిండియాకు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన లెజెండరీ కెప్టెన్ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం వైభవ్ విషయంలో భిన్నంగా స్పందించాడు.
అతడి గతి ఏమైందో తెలుసు కదా!
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ విషయంలో తొందరపాటు తగదు. అతడి గురించి ఇప్పుడే అంచనా వేయడం సరికాదు. నిజంగా అతడికి ఆడగల సామర్థ్యం ఉందా? అంటే అవునని చెప్పవచ్చు.
కానీ క్రికెట్‌లో చాలా మంది ఇలాంటి.. ఇంతకు మించిన నైపుణ్యాలతో దూసుకువచ్చారు. అయితే, అనతికాలంలోనే వారు కనుమరుగైపోయారు. వినోద్ కాంబ్లీనే చూడండి. అతడి గతి ఏమైందో తెలుసు కదా!.. అతడి గురించి మనం ఏం మాట్లాడగలము?
వైభవ్ ఇప్పుడు పదిహేను- పదహారేళ్ల పిల్లాడు మాత్రమే. అతడికి కనీసం ఇంకో మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పుడు అతడి గురించి చర్చిస్తే బాగుంటుంది. కాలక్రమేణా వైభవ్ జీవనశైలి, ఆలోచనా విధానం మారిపోతుంది. అప్పుడే అతడు ఆటలో ఇదే స్థాయిలో కొనసాగగలడా? లేదా అన్నది తెలుస్తుంది.
జీవనశైలి, క్రమశిక్షణ ముఖ్యం
అతడి ప్రదర్శనల కంటే కూడా.. అతడి జీవనశైలి ఎలా ఉండబోతున్నదే ముఖ్యమైన అంశంగా మారుతుంది. క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటికే సచిన్, రోహిత్, విరాట్‌లను చూశాము. ఈ ముగ్గురు మనల్ని గర్వపడేలా చేశారు.
తదుపరి సూపర్‌స్టార్ ఎవరు? అన్న ప్రశ్న ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు పదిహేనేళ్ల వైభవ్‌కు ఆ అవకాశం వచ్చింది. అతడు తదుపరి విరాట్ కాగలడా? అంటే కాలమే ఇందుకు సమాధానం చెప్తుంది’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?
అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు మూడు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్న విరుష్క


