భారత టీ20 జట్టు (PC: BCCI X)
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు దక్కకపోయినా.. నాకౌట్ దశలో తిరిగి వచ్చి ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.
ధనాధన్ దంచికొట్టి
సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 50 బంతుల్లో 97 (నాటౌట్), ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 42 బంతుల్లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు సంజూ. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.
వరుస వైఫల్యాలు
ఆ తర్వాత ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరంభంలో తడబడ్డ సంజూ.. ఆ తర్వాత వరుస సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో మరోసారి తేలిపోయాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 5, 0 పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 1, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
అనంతరం జపాన్‌తో ఏకైక టీ20లోనూ విఫలమైన సంజూ (9).. ఆసియా క్రీడలు-2026లో సెమీస్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో 7, పాకిస్తాన్‌తో ఫైనల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి టీ20లో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
అప్పుడు ఇషాన్.. ఇప్పుడు వైభవ్
ఈ నేపథ్యంలో సంజూ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఇషాన్ కిషన్ సంజూకు పోటీగా రాగా.. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ కూడా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీనిస్తున్నాడు. దీంతో సంజూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్లు అతడి వైఫల్యాల ద్వారా అర్థమవుతోంది.
అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం సంజూకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని హామీ ఇవ్వడం అతడికి కాస్త సానుకూలాంశం. వరల్డ్‌కప్ హీరోను కాదని.. వైభవ్‌కు ఇప్పుడే వరుస అవకాశాలు ఇవ్వలేమని గంభీర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంజూ ఆట తీరు అతడికి కూడా తలనొప్పిగా మారింది.
గంభీర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి
ముఖ్యంగా జట్టు ఓడిపోతే మాత్రం సంజూపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగితే.. గంభీర్ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఏదేమైనా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విండీస్‌తో శుక్రవారం నాటి రెండో టీ20లోనైనా బ్యాట్ ఝులిపించాల్సిందే. లేదంటే తుదిజట్టు నుంచి కనుమరుగయ్యే దుస్థితి వస్తుంది.
ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?
టీమిండియాకు దూరమైన క్రికెటర్ హనుమ విహారి కూడా ఇదే మాట అంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సంజూ శాంసన్‌ను యాజమాన్యం ఇంకెన్నాళ్లు కొనసాగిస్తుందని ప్రశ్నించాడు. ఈ మేరకు.. ‘‘సంజూ మరోసారి విఫలమయ్యాడు. ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?
నిజానికి నేను అతడికి అభిమానినే. సంజూ ఆడితే చూడాలని నాకూ ఉంది. అయితే, ప్రస్తుతం సంజూ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడు. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఇషాన్ జట్టులోకి తిరిగి వచ్చినపుడు కూడా సంజూ సరిగ్గా ఆడలేకపోయాడు.
ఒత్తిడిలో కూరుకుపోయాడు
ఇప్పుడు వైభవ్ అతడి వెంట పడుతున్నాడు. గట్టి పోటీనిస్తున్నాడు. దీంతో సంజూ మరోసారి ఒత్తిడిలో కూరుకుపోయాడు. జట్టులో స్థానం ఉంటుందో లేదోనన్న భయం అతడిని వెంటాడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి సహజం. అయితే, చాలా మందికి ఈ విషయం పెద్దగా అర్థం కాదు. ఏదేమైనా ఒత్తిడిని జయిస్తేనే సంజూ కెరీర్ సాఫీగా సాగుతుంది’’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.
చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు మూడు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్న విరుష్క


