నువ్వు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నా: గంభీర్‌ | I am sure: Gambhir Message To Shreyas Iyer After T20I Captaincy Appointment | Sakshi
Sakshi News home page

నువ్వు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నా: గంభీర్‌

Jun 26 2026 11:07 AM | Updated on Jun 26 2026 11:30 AM

I am sure: Gambhir Message To Shreyas Iyer After T20I Captaincy Appointment

శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI)

భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. నూతన కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ తన ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌ వేదికగా శుక్రవారం అతడు తొలిసారి టీమిండియా టీ20 సారథిగా బరిలోకి దిగబోతున్నాడు.

కేవలం ఆటలోనే కాదు..
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనను ఆరంభించే ముందు..  టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్‌కు నా శుభాకాంక్షలు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం.

నువ్వు ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ.. అద్భుతంగా రాణించగలవని కచ్చితంగా చెప్పగలను. కేవలం ఆటలోనే కాదు.. మైదానం వెలుపలా నువ్వు గొప్పగా పనిచేయగలవు’’ అని గంభీర్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ను ప్రశంసించాడు. కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు వేసి మరీ.. యాజమాన్యం శ్రేయస్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

దాదాపు మూడేళ్ల తర్వాత
ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల తర్వాత శ్రేయస్‌.. ఏకంగా సారథిగా టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ ముంబైకర్‌ను కెప్టెన్‌గా నియమించడంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ది కీలక పాత్ర అని సమాచారం. గంభీర్‌ వద్దన్నా పట్టుబట్టి మరీ శ్రేయస్‌నే కెప్టెన్‌గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.

గంభీర్‌తో విభేదాలు?
కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. అయితే, అతడి కంటే కూడా.. అప్పుడు ఆ జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌కే ఈ విషయంలో ఎక్కువగా క్రెడిట్‌ దక్కింది. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.

కోల్‌కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులు
అనంతరం గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. శ్రేయస్‌ కోల్‌కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 26.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఇక 2025లో బ్యాటర్‌గా.. సారథిగా సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు శ్రేయస్‌.

పంజాబ్‌ సారథిగా సూపర్‌ హిట్‌ అయినా..
అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ సేన.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్‌ పరాజయాలతో చతికిలపడింది. దీంతో ఈసారి కనీసం ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే పంజాబ్‌ నిష్క్రమించింది. 

అయితే, ఆటగాడిగా శ్రేయస్‌ మాత్రం రాణించాడు. ఇక ఐపీఎల్‌తో పాటు దేశీ క్రికెట్‌లోనూ రాణించిన ఈ ముంబైకర్‌కు టీమిండియా యాజమాన్యం ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్‌ ఇచ్చి.. తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం.

చదవండి: వైభవ్‌ అరంగేట్రం కోసం వాళ్లను బలి చేయలేము

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement