తిలక్‌ వర్మకు జాక్‌ పాట్‌.. భారీ ధరకు అమ్ముడుపోయిన హైదరాబాదీ | How much was Tilak Varma sold for in the TG T20 league? | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మకు జాక్‌ పాట్‌.. భారీ ధరకు అమ్ముడుపోయిన హైదరాబాదీ

Jun 7 2026 12:07 PM | Updated on Jun 7 2026 1:25 PM

How much was Tilak Varma sold for in the TG T20 league?

తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TG20) తొలి సీజన్ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్‌, హైదరాబాదీ తిలక్ వర్మకు జాక్ పాట్ తగిలింది. రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ వర్మ భారీ ధర పలికాడు. అతడి కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్,  నల్గొండ జట్లు పోటీపడ్డాయి. 

చివరకు తిలక్‌ను రూ.33 లక్షలకు మెదక్ జట్టు సొంతం చేసుకుంది. అదేవిధంగా తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్ తనయుడు చామ మిలింద్ ఆనంద్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. రూ.5 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన అతడిని  రూ.17 లక్షల భారీ ధరకు అన్విత ఖమ్మం ఏసెస్‌ దక్కించుకుంది.

మరోవైపు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు అమన్ రావు పేరాలను రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది.

తిలక్‌కు డబుల్‌ జాక్‌పాట్‌
కాగా తిలక్‌ వర్మ తాజాగా భారత టీ20 జట్టుకు కూడా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 24 గంటలు గడవకముందే టీజీ టీ20 లీగ్‌ వేలంలో రికార్డు ధర సొంతం చేసుకోవడంతో అతడికి డబుల్‌ జాక్‌పాట్‌ తగిలినట్లైంది. కాగా ఈ మెగా టోర్నమెంట్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. 

అయితే ఈ టోర్నీలో మొత్తం మ్యాచ్‌లకు తిలక్‌, సిరాజ్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అదే సమయంలో భారత జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఇక 21 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 32 మ్యాచ్‌లు జరుగుతాయి.

అన్ని మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ తొలి సీజన్‌ వేలం కోసం 1,300 మందికి పైగా ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోయేషన్‌ కేవలం 160 మంది ప్లేయర్లను మాత్రమే షార్ట్‌లిస్ట్‌ చేసింది.

బరిలో ఉన్న 8 ఫ్రాంచైజీ జట్లు ఇవే
హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్

మెదక్ ఫాల్కన్స్ (Medak Falcons)

వరంగల్ వారియర్స్ (Warangal Warriors)

అన్విత ఖమ్మం ఏసెస్ (Anvita Khammam Aces)

అనురాగ్ నల్గొండ నైట్స్ (Anurag Nalgonda Knights)

ప్రణవ రంగారెడ్డి రైజర్స్ (Pranava Ranga Reddy Risers)

కరీంనగర్ డైమండ్స్ (Karimnagar Diamonds)

పాలమూరు స్ట్రైకర్స్ (Palamuru Strikers)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement