
గత ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ.. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు.
రాఠీ ఈ డీపీఎల్ సీజన్‌లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించాడు. పైగా 10 ఎకానమీ రేట్‌కు తగ్గకుండా పరుగులు సమర్పించుకుని ప్రత్యర్థి బ్యాటర్లు పండుగ చేసుకునేలా చేశాడు.
ఐపీఎల్ 2025లో ఆకట్టుకునే ఎకానమీతో (8.25) బౌలింగ్ చేసి 14 వికెట్లు (13 మ్యాచ్‌ల్లో) తీసిన రాఠీపై డీపీఎల్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్‌లో అతను సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు.
రాఠీ న్యూఢిల్లీ టైగర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి గాడిలో పడినట్లు కనిపించాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఏకంగా 24 పరుగులిచ్చి మళ్లీ మొదటికొచ్చాడు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న రాఠీ వరుసగా వైఫల్యాలు చెందుతుండటంతో అతని జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. రాఠీ మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో రాణిస్తేనే సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నాకౌట్ చేరే అవకాశం ఉంటుంది.
గత సీజన్‌లో రాఠీ ప్రదర్శన ప్రస్తుత సీజన్‌కు భిన్నంగా ఉంది. 2024 సీజన్‌లో అతను 10 మ్యాచ్‌ల్లో కేవలం 7.83 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే రాఠీకి ఐపీఎల్ నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్‌లో తన అరంగేట్రం సీజన్‌లోనే రాఠీ ఆకట్టుకున్నాడు. నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు నోట్ బుక్ సెలబ్రేషన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.
రాఠీకి భిన్నంగా ప్రియాంశ్ ఆర్య
ప్రస్తుత డీపీఎల్ సీజన్‌లో మరో ఐపీఎల్ స్టార్ ప్రియాంశ్ ఆర్య (ఔటర్ ఢిల్లీ) తొలుత నిరాశపరిచినా, ఆతర్వాత గాడిలో పడ్డాడు. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోయిన ఆర్య.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.
ఆర్య గత డీపీఎల్ సీజన్‌లోనూ ఇలాంటి విధ్వంసకర శతకాలు బాది ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ తరఫున అంచనాలకు మించి రాణించాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన ఆర్య.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్‌ల్లో 179.25 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు) పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.