
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. వికెట్ కీపర్లలోనూ మొదటి ప్రాధాన్యంగా తన ఓటు సంజూకేనని స్పష్టం చేశాడు.
గిల్, జైసూ రీ ఎంట్రీ పక్కా!
కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్‌కు ఆగష్టు 19న బీసీసీఐ తమ జట్టును ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ల టీ20 రీఎంట్రీపై చర్చ భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు గిల్, జైసూలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచిస్తుండగా.. కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సంజూ- అభిషేక్ శర్మలనే ఓపెనింగ్ జోడీనే కొనసాగించాలని పేర్కొన్నాడు.
జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!
అయితే, వీరికి బ్యాకప్ ఓపెనర్‌గా గిల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘జైస్వాల్, గిల్.. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే వీలుంది. నేనైతే శుబ్‌మన్ గిల్ వైపే మొగ్గుచూపుతాను.
ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా గిల్ రాణించాడు. 750 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లోనూ అతడు మెరుగ్గా రాణించాడు. అయితే, తుదిజట్టులో కాకపోయినా.. బ్యాకప్ ఓపెనర్‌గానైనా గిల్ పేరు ఆసియా కప్ జట్టులో ఉంటుంది.
జితేశ్ శర్మకు నా ఓటు
నిజానికి ఓపెనింగ్ స్లాట్ కోసం గిల్- జైస్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే, ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. గిల్ సరైన ఆప్షన్ అవుతాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే.. జితేశ్ శర్మకు నా ఓటు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్ చేరి టైటిల్ గెలవడంలో జితేశ్ పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆసియా కప్ టోర్నీలో సంజూ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటే.. జితేశ్ అతడికి బ్యాకప్‌గా ఉండాలి’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అదే విధంగా.. ఆసియ కప్-2025లో భారత తుదిజట్టును కూడా కైఫ్ ఈ సందర్భంగా ఎంచుకున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మలను కైఫ్ తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు.
ఆసియా కప్-2025లో కైఫ్ ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదే
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.
చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!