అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్‌ | He Didn't Get Fair Chance: Gambhir Confirms India Star Return To Test XI | Sakshi
Sakshi News home page

అతడికి అన్యాయం.. ఎక్కువ ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్‌

Jun 5 2026 1:53 PM | Updated on Jun 5 2026 3:21 PM

He Didn't Get Fair Chance: Gambhir Confirms India Star Return To Test XI

టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత ముల్లన్‌పూర్‌ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

వన్‌డౌన్‌లో ఎవరు?
శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టెస్టు జట్టులో కొత్తగా మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో స్థానం కోసం సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ మధ్య పోటీ నెలకొంది. సాయి సుదర్శన్‌ చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తరఫున బరిలో దిగాడు.

ఈ మ్యాచ్‌లో సాయి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో టెస్టులో సాయికి కాకుండా పడిక్కల్‌కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ స్పందించాడు.

న్యాయంగా మరొక్క ఛాన్స్‌ ఇవ్వాలి
అఫ్గన్‌తో శనివారం నాటి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్‌కు సరైన అవకాశాలు లభించలేదు. అతడు ఎక్కువగా ఇంగ్లండ్‌లోనే ఆడాడు. అతడికి న్యాయంగా మరొక్క ఛాన్స్‌ ఇవ్వాలని నేను బలంగా విశ్వసిస్తున్నా.

ఏదేమైనా మేము పదకొండు మందిని మాత్రమే తుదిజట్టులోకి ఎంపిక చేస్తాము కదా!.. సాయి ఫామ్‌ కూడా మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఇటీవల ఐపీఎల్‌లో అతడు 700కు పైగా పరుగులు సాధించాడు. కేవలం 4-5 మ్యాచ్‌ల ద్వారా సాయి ఆట తీరుపై నిర్ణయానికి రాకూడదు’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

పడిక్కల్‌ మరోసారి బెంచ్‌కే 
తద్వారా అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో సాయి సుదర్శన్‌లో వన్‌డౌన్‌లో ఆడిస్తామని గంభీర్‌ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో పడిక్కల్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

కాగా కర్ణాటక బ్యాటర్‌ పడిక్కల్‌ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో 543 పరుగుల సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, గంభీర్‌ మాత్రం సాయి వైపే మొగ్గుచూపడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. చివరగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడిన టీమిండియా.. ప్రత్యర్థి చేతిలో 2-0తో వైట్‌వాష్‌ అయింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో టెస్టు ప్రపంచకప్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో భాగం కాదు. అయితే, ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకునే వీలు దొరికింది. కాగా టెస్టు తర్వాత టీమిండియా అఫ్గన్‌తో మూడు వన్డేలు ఆడనుంది.

చదవండి: ‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు నచ్చదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement