PC: BCCI
టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఆట తీరును భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్‌లో బాగానే ఆడుతున్నప్పటికీ.. జాతీయ జట్టు తరఫున మాత్రం తేలిపోతున్నాడని పెదవి విరిచాడు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ప్రసిద్ ఒకడని విమర్శలు గుప్పించాడు.
34 పరుగుల తేడాతో
కాగా టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం చవిచూసింది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో 34 పరుగుల తేడాతో చాంపియన్ జట్టు ఓటమిపాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు.. శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. వీరంతా సగటున 6 ఎకానమీతో పరుగులు ఇచ్చారు.
దారుణ ప్రదర్శన
అయితే, ఈ మ్యాచ్‌లో ప్రసిద్ కృష్ణ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 57 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమీ 14.20. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ప్రసిద్ కృష్ణ ఆటను విమర్శించాడు.
‘‘హర్షిత్ రాణా రీఎంట్రీలో అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్ కూడా రాణించాడు. అక్షర్ కూడా ఓకే. శివం దూబే మూడు ఓవర్లు వేసి వికెట్ తీయగలిగాడు. కానీ ప్రసిద్ కృష్ణ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
ఒక్క ఓవర్లోనే అన్ని పరుగులా?
ఇప్పటి వరకు టీమిండియా తరఫున అతడు ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడి.. 24 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీశాడు. అతడు ప్రతీ మ్యాచ్‌లోనూ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం మంచి విషయం. కానీ ఓవర్‌కు సగటున 11.5 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు.
అయితే ఐపీఎల్‌లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రసిద్ బాగానే రాణిస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. టీమిండియానే అతడి సేవల్ని సద్వినియోగం చేసుకోలేకపోతోందా?’’ అని ఆకాశ్ చోప్రా తన పేర్కొన్నాడు.
కాగా టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆదివారం నిర్ణయాత్మక రెండో టీ20 సైతం బెల్‌ఫాస్ట్ వేదికగానే జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రసిద్‌ను తప్పించి.. ప్రిన్స్ యాదవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ‘నేను 13 సిక్సర్లు కొడతాను.. మిగతాది మీరు చూసుకోండి’


