ఐర్లాండ్‌ దెబ్బ కొట్టింది | Ireland beat India by 34 runs in the first T20I | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌ దెబ్బ కొట్టింది

Jun 27 2026 3:30 AM | Updated on Jun 27 2026 3:30 AM

Ireland beat India by 34 runs in the first T20I

తొలి టి20లో భారత్‌ అనూహ్య ఓటమి

34 పరుగులతో ఓడిన వరల్డ్‌ చాంపియన్‌

రేపు రెండో టి20 మ్యాచ్‌  

బెల్‌ఫాస్ట్‌: టి20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన తర్వాత ఆడిన తొలి పోరులో భారత్‌కు గట్టి షాక్‌ తగిలింది. గతంలో ఎనిమిది సార్లు భారత్‌తో తలపడి అన్నింట్లో ఓడిన ఐర్లాండ్‌ ఈసారి పదునైన ఆటతో దెబ్బ కొట్టింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా అనూహ్యంగా తలవంచింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ లోర్కాన్‌ టకర్‌ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), గారెత్‌ డెలానీ (32 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. అనంతరం భారత్‌ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (14 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే దూకుడుగా ఆడగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యం... 
హర్షిత్, అర్ష్ దీప్ పదునైన బౌలింగ్‌తో ఐర్లాండ్‌ 6 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. డెయిర్‌ (0), హ్యారీ టెక్టర్‌ (0), టిమ్‌ టెక్టర్‌ (17) వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో జట్టు 36 పరుగులే చేసింది. దూబే తొలి బంతికే బెన్‌ కాలిట్జ్‌ (15)ను అవుట్‌ చేయడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో టకర్, డెలానీ కలిసి ఐర్లాండ్‌ను ఆదుకున్నారు. 9 పరుగుల వద్ద డెలానీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అభిషేక్‌ వదిలేశాడు. అక్షర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన టకర్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిధ్‌ ఓవర్లో డెలానీ వరుసగా 4, 6, 6, 6 బాదగా మొత్తం 27 పరుగులు వచ్చాయి. చివరి 4 ఓవర్లలో ఐర్లాండ్‌ 45 పరుగులు చేసింది.  

అభిషేక్‌ మినహా... 
ఛేదనలో ఒకవైపు అభిషేక్‌ చెలరేగినా... మరోవైపు సామ్సన్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (1) విఫలమయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలి టి20 మ్యాచ్‌ ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ (3) ప్రభావం చూపకపోగా, తిలక్‌ వర్మ (19) కూడా నిలవలేదు. కొద్దిగా పోరాడిన దూబే అవుటయ్యే సమయానికి భారత్‌ 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తర్వాతి 17 బంతుల్లో జట్టు మరో 13 పరుగులు మాత్రమే చేసిన జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది.

వైభవ్‌కు చోటు లేదు! 
భారత అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన క్షణం శుక్రవారం రాలేదు. తుది జట్టులో వైభవ్‌ సూర్యవంశీని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేయలేదు. వరల్డ్‌ కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన టాప్‌–3నే కొనసాగించడంతో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లేకుండా పోయింది.

తొలి బంతికే ‘జై’... 
అంతర్జాతీయ క్రికెట్‌లో తాను వేసిన తొలి బంతికే సామ్సన్‌ను బౌల్డ్‌ చేసి ఐర్లాండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ జై ముంద్రా సంచలనం సృష్టించాడు. 29 ఏళ్ల ముంద్రా భారత్‌కు చెందినవాడే. రాజస్తాన్‌లోని టోంక్‌లో పుట్టిన అతను ఐదేళ్ల క్రితం ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు ఐర్లాండ్‌కు వెళ్లాడు. భారత్‌లో క్రికెట్‌తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మరో దేశంలో కొనసాగించిన ఆటగాడు కాదు అతను. 

డబ్లిన్‌లో అడుగు పెట్టిన తర్వాతే ఆటపై ఆసక్తితో ప్రతిష్టాత్మక లీన్‌స్టర్‌ క్లబ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా ముంద్రా చేరాడు. ఆ తర్వాత అతను పేస్‌ బౌలింగ్‌ వైపు మళ్లాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయక ముందు ముంద్రా దేశవాళీ క్రికెట్‌లో 1 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్, 6 వన్డేలు, 5 టి20లు ఆడాడు. బాబ్జీ నరసింహారావు, రమణ్‌ లాంబా, సిమి సింగ్, రాబిన్‌ వాటర్స్‌ తరహాలో భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు. 

స్కోరు వివరాలు  
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: టిమ్‌ టెక్టర్‌ (సి) అయ్యర్‌ (బి) రాణా 17; అడెయిర్‌ (సి) సామ్సన్‌ (బి) రాణా 12; హ్యారీ టెక్టర్‌ (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్ 0; టకర్‌ (సి) తిలక్‌ (బి) రాణా 50; కాలిట్జ్‌ (సి) ప్రసిధ్‌ (బి) రాణా 15; డెలానీ (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్ 49; డాక్‌రెల్‌ (సి) అర్ష్ దీప్ (బి) అక్షర్‌ 19; మెక్‌కార్తీ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 7; హంఫ్రీస్‌ (రనౌట్‌) 2; ముంద్రా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–20, 2–25, 3–30, 4–51, 5–115, 6–164, 7–178, 8–178, 9–182. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–28–2, హర్షిత్‌ రాణా 4–0–24–3, ప్రసిధ్‌ 4–0–57–0, శివమ్‌ దూబే 3–0–18–1, అక్షర్‌ 4–0–33–2, సుందర్‌ 1–0–19–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) కాలిట్జ్‌ (బి) మెక్‌కార్తీ 50; సామ్సన్‌ (బి) ముంద్రా 5; ఇషాన్‌ కిషన్‌ (సి) టకర్‌ (బి) హోలార్డ్‌ 1; అయ్యర్‌ (సి) డాక్‌రెల్‌ (బి) హోలార్డ్‌ 3; తిలక్‌ (సి) అడెయిర్‌ (బి) హంఫ్రీస్‌ 19; సుందర్‌ (సి) కాలిట్జ్‌ (బి) హోలార్డ్‌ 9; దూబే (సి అండ్‌ బి) ముంద్రా 25; అక్షర్‌ (సి) టిమ్‌ టెక్టర్‌ (బి) డెలానీ 15; రాణా (సి) కాలిట్జ్‌ (బి) హంఫ్రీస్‌ 8; అర్ష్ దీప్ (సి) టిమ్‌ టెక్టర్‌ (బి) హంఫ్రీస్‌ 2; ప్రసిధ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 148. వికెట్ల పతనం: 1–16, 2–45, 3–60, 4–80, 5–90, 6–100, 7–135, 8–137, 9–147, 10–148. బౌలింగ్‌: హంఫ్రీస్‌ 3.5–0–38–3, జై ముంద్రా 4–0–25–2, మెక్‌కార్తీ 3–0–29–1, హోలార్డ్‌ 4–0–28–3, హ్యారీ టెక్టర్‌ 3–0–22–0, డెలానీ 1–0–3–1.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement