ODI WC: హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రెడ్డికి ప్రత్యామ్నాయం వీళ్లే! | Hardik Pandya Nitish Kumar Reddy Substitutes India Has Before ODI 2027 WC | Sakshi
Sakshi News home page

ODI WC 2027: హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రెడ్డికి ప్రత్యామ్నాయం వీళ్లే!

Jun 24 2026 3:27 PM | Updated on Jun 24 2026 4:59 PM

Hardik Pandya Nitish Kumar Reddy Substitutes India Has Before ODI 2027 WC

టీమిండియాకు దొరికిన అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యా ఒకడు. ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా టెస్టు ఫార్మాట్‌ను వదిలేసి.. కేవలం వన్డే, టీ20 ఫార్మాట్లకే పరిమితమయ్యాడు ఈ బరోడా ఆటగాడు. ఇక టెస్టుల్లో హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా శార్దూల్‌ ఠాకూర్‌ వంటివారు జట్టులోకి వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 

అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. దేశీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున సత్తా చాటి హార్దిక్‌ పాండ్యాకు వారసుడు దొరికినట్లే అని ఇటు అభిమానులు, అటు సెలక్టర్లు సంతోషించేలా ప్రదర్శనలు ఇచ్చాడు.

ఇద్దరికీ గాయాలు
అయితే, ఇటీవల హార్దిక్‌ పాండ్యా వెన్నునొప్పి కారణంగా అఫ్గానిస్తాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. హార్దిక్‌ స్థానంలో ఈ రెండు సిరీస్‌లకూ ఎంపికైన నితీశ్‌ రెడ్డి కూడా తాజాగా గాయపడ్డాడు. 

ఇటీవల అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డే సందర్భంగా నితీశ్‌ ఎడమకాలి కండరాలు పట్టేశాయి. దీంతో కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో అతడి స్థానంలో ముంబై యువ ఆటగాడు సూర్యాన్ష్‌ షెడ్గేకు చోటు కల్పించారు.

నిజానికి ఐసీసీ టోర్నీల్లో హార్దిక్‌ పాండ్యా కీలక రాణిస్తూ ఇటీవలి కాలంలో జట్టు ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ- 2025, టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్‌ పాత్ర మరువలేనిది. 

ఇక వన్డే వరల్డ్‌కప్‌-2027 నాటికి ఒకవేళ హార్దిక్‌ పాండ్యా పూర్తి స్థాయిలో కోలుకోకపోతే.. నితీశ్‌ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఇప్పటికే చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు. ఇలాంటి తరుణంలో నితీశ్‌ రెడ్డి కూడా తరచుగా గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. దురదృష్టవశాత్తూ హార్దిక్‌, నితీశ్‌ ఇద్దరూ అందుబాటులో లేకుంటే.. వరల్డ్‌కప్‌లో వీరి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

శార్దూల్‌ ఠాకూర్‌
చాన్నాళ్ల పాటు టీమిండియాకు దూరమైన శార్దూల్‌ ఠాకూర్‌ ఐపీఎల్‌-2026లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఆరంభ మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తంగా ఏడు మ్యాచ్‌లలో కలిపి పన్నెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 34 ఏళ్ల శార్దూల్‌ ఠాకూర్‌ 47 వన్డేలు ఆడి 6.22 ఎకానమీతో 65 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా వన్డే ఆడాడు. హార్దిక్‌, నితీశ్‌లకు.. అనుభవజ్ఞుడైన శార్దూల్‌ మంచి బ్యాకప్‌ ఆప్షన్‌ అనే చెప్పవచ్చు.

శివం దూబే
భారత టీ20 జట్టులో కీలక సభ్యుడు శివం దూబే. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం ఈ ముంబైకర్‌ తన చోటును పదిలం చేసుకోలేకపోయాడు. నితీశ్‌ రెడ్డి రైజింగ్‌తో దూబే మరింతగా వెనుకబడ్డాడు.

నిజానికి దూబేకు వన్డేల్లో టీమిండియాకు ఆడిన అనుభవం అంతగా లేదు. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 43 పరుగులు చేయడంతో పాటు ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. చివరగా శ్రీలంక పర్యటనలో 2024లో వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

అయితే, ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉండే శివం దూబే.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. సిక్సర్లు బాదగలడు. తన ఎత్తు కారణంగా బౌన్స్‌ రాబట్టగలడు. రైటార్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టగలడు. ఒత్తిడిలోనూ ఫినిషర్‌గా రాణించడం అతడికి ఉన్న అదనపు బలం.

సూర్యాంశ్‌ షెడ్గే
ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌లో 23 ఏళ్ల సూర్యాంశ్‌ షెడ్గే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ ఆడి 144 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీశాడు.

ఇక ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 158 పరుగులు చేశాడు సూర్యాంశ్‌. ఒకవేళ ఇంగ్లండ్‌ పర్యటనలో గనుక ఆడే అవకాశం వచ్చి సత్తా చాటితే.. మరికొన్నాళ్ల పాటు జట్టులో కొనసాగగలడు.

మాధవ్‌ తివారి
ఈ ఏడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మాధవ్‌ తివారి.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున మూడు మ్యాచ్‌లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. మరికొన్ని మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్‌ చేసి సత్తా చాటాడు.

ఇదిలా ఉంటే.. 22 ఏళ్ల మాధవ్‌ తివారి మధ్యప్రదేశ్‌ టీ20 లీగ్‌లో గత రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు కూల్చిన మాధవ్‌ తివారి.. 270 పరుగులు సాధించాడు.

అయితే, ఇప్పటికీ మధ్యప్రదేశ్‌ సీనియర్‌ జట్టు తరఫున అతడు అరంగేట్రం చేయలేదు. కానీ.. కొత్త బంతితో తొలి ఓవర్లు, డెత్‌ ఓవర్లలో రాణించడం అతడికున్న బలం. వైవిధ్యమైన స్పెల్స్‌ వేయడంలోనూ మాధవ్‌ దిట్ట.

చదవండి: ఒకరు వదిలించుకున్నారు.. మరొకరు ఓపికతో దక్కించుకున్నారు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement