టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.
అప్పుడు కెప్టెన్సీ చేజారింది
అయితే, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
సూర్యపై తప్పని వేటు
కానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పిల్లాడికి అవకాశం
ఐర్లాండ్‌తో పాటు.. ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.
హార్దిక్‌కు దక్కని చోటు
కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఇక హార్దిక్ పది మ్యాచ్‌లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.
ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.
మూడు జట్లలోనూ నితీశ్ రెడ్డి
తాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.
అందుకే అతడిని ఎంపిక చేశాం
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ రెడ్డి మాకు దొరికాడు.
రొటేషన్ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్‌కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్‌కప్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.
తద్వారా హార్దిక్ ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ నితీశ్ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది.


