ఉస్మాన్‌ 'హ్యాట్రిక్‌' | France defeat Norway in FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

ఉస్మాన్‌ 'హ్యాట్రిక్‌'

Jun 28 2026 12:46 AM | Updated on Jun 28 2026 12:46 AM

France defeat Norway in FIFA World Cup 2026

నార్వేపై 4–1తో ఫ్రాన్స్‌ ఘన విజయం

బోస్టన్‌: ‘ఫిఫా’ ప్రపంచ కప్‌లో మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ తమ జోరు కొనసాగించింది. గ్రూప్‌ ‘ఐ’లో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టాపర్‌గా ‘నాకౌట్‌’లోకి ప్రవేశించింది. 1998లో విజేతగా నిలిచిన తర్వాత లీగ్‌ దశలో ఫ్రాన్స్‌ అన్ని మ్యాచ్‌లూ గెలవడం ఇదే మొదటిసారి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 4–1 గోల్స్‌ తేడాతో నార్వేను చిత్తు చేసింది. ఫ్రాన్స్‌ తరఫున ఉస్మాన్‌ డెంబెలె ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌ సాధించడం విశేషం.

తొలి అర్ధ భాగంలోనే (7వ, 20వ, 32వ నిమిషాల్లో) అతను మూడు గోల్స్‌ కొట్టాడు. తద్వారా ప్రపంచ కప్‌ చరిత్రలో రెండో వేగవంతమైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. 1954 ప్రపంచ కప్‌లో చెకొస్లవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా ఆటగాడు ఎరిక్‌ ప్రోబ్‌ ఆట మొదలైన 24 నిమిషాల్లోనే మూడు గోల్స్‌ కొట్టి రికార్డు నమోదు చేశాడు.

తాజా మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ తరఫున నాలుగో గోల్‌ను డిజైర్‌ డో (90+4వ ని.లో) సాధించగా ... నార్వే ఆటగాడు థెలో అస్‌గార్డ్‌ (21వ ని.లో) ఏకైక గోల్‌ కొట్టాడు. అయితే ‘ఐ’ గ్రూప్‌ నుంచి ఈ మ్యాచ్‌కు ముందే నార్వే కూడా నాకౌట్‌కు అర్హత సాధించగా... సంచలన ప్రదర్శనతో సెనెగల్‌ కూడా ముందంజ వేసింది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌ 5–0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. 

సెనెగల్‌ తరఫున పేప్‌ గుయె (59వ, 71వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ కొట్టగా... హబీబ్‌ దియారా (4వ ని.), ఇస్మాయిలా సర్‌ (56వ ని.), లిమాన్‌ ఎన్‌దియె (82వ ని.) ఒక్కో గోల్‌ కొట్టారు. ఈ గ్రూప్‌లో సెనెగల్‌ మూడో స్థానంలో నిలిచింది. అయితే 12 గ్రూప్‌ల నుంచి మూడో స్థానాల్లో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన టాప్‌–8 టీమ్‌లు కూడా ముందంజ వేస్తాయి. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో సెనెగల్‌ నాకౌట్‌లోకి ప్రవేశించింది.  

బెల్జియం, ఈజిప్ట్‌ ముందంజ 
2018 ప్రపంచ కప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన (మూడో స్థానం) కనబర్చిన బెల్జియం జట్టు మరో సారి నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌ ‘జి’లో జరిగిన పోరులో బెల్జియం 5–1 గోల్స్‌ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. బెల్జియం తరఫున లియాండ్రో ట్రొసార్డ్‌ (28వ, 50వ  నిమిషాల్లో), కెవిన్‌ డి బ్రూన్‌ (66వ ని.), రొమేలు ల్యూకాకు (86వ ని.), అలెక్సిస్‌ సెల్‌మెకర్స్‌ 99+4వ ని.) గోల్స్‌తో చెలరేగగా... న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో ఎలీజా జస్ట్‌ (84వ ని.) ఏకైక గోల్‌ కొట్టాడు. మూడో సారి ప్రపంచ కప్‌ బరిలోకి దిగిన కివీస్‌ టీమ్‌ ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. 

ఈ గ్రూప్‌లో ఓటమి లేకుండా అజేయంగా నిలిచిన ఈజిప్ట్‌ రెండో జట్టుగా క్వాలిఫై అయింది. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఈజిప్ట్‌ 1–1తో డ్రా చేసుకుంది. ఈజిప్ట్‌ తరఫున మహమూద్‌ సాబెల్‌ (5వ ని.) గోల్‌ సాధించగా... ఇరాన్‌ ఆటగాళ్ళలో రమీన్‌ రెజైన్‌ (14వ ని.) గోల్‌ చేశాడు. 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్‌ తొలిసారి నాకౌట్‌కు చేరడం విశేషం. ఈ టోర్నీకి ముందు మూడు వరల్డ్‌ కప్‌లు ఆడిన ఈజిప్ట్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది.

ఒక్క మ్యాచ్‌ గెలవకున్నా... 
గ్రూప్‌ ‘హెచ్‌’లో సంచలన ఫలితం నమోదైంది. మాజీ చాంపియన్‌ ఉరుగ్వే నిష్క్రమించగా... తొలిసారి ప్రపంచ కప్‌ ఆడుతున్న కేప్‌ వెర్డె నాకౌట్‌కు అర్హత సాధించింది. 2010 వరల్డ్‌ కప్‌ విజేత స్పెయిన్‌ 1–0 గోల్‌తో ఉరుగ్వేను ఓడించి నాకౌట్‌కు చేరింది. స్పెయిన్‌ తరఫున అలెక్స్‌ బెనా (42వ నిమిషం) ఏకైక గోల్‌ కొట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న ఉరుగ్వే... ఈ టోర్నీలో లీగ్‌ దశలోనే నిష్క్రమించిన అత్యుత్తమ ర్యాంకింగ్‌ టీమ్‌గా నిలిచింది. 

ఉరుగ్వే 1930, 1950లలో చాంపియన్‌గా నిలిచింది. మరో వైపు కేప్‌ వెర్డెకు అదృష్టం కలిసొచ్చింది. ఆ జట్టు 3 మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని నమోదు చేయకున్నా... మూడూ ‘డ్రా’గా ముగించడంలో సఫలమైంది. ఫలితంగా ఉరుగ్వేను వెనక్కి నెట్టి ముందంజ వేసింది. కేప్‌వెర్డె, సౌదీ అరేబియా మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. 1998 వరల్డ్‌ కప్‌లో చిలీ తర్వాత లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌ గెలవకున్నా నాకౌట్‌కు చేరిన మొదటి జట్టుగా కేప్‌ వెర్డె నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement