నేడు వెస్టిండీస్‌తో భారత్ నాలుగో టి20
జోరు మీదున్న టీమిండియా
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇరు జట్లూ మెరుపు షాట్లతో పరుగుల వరద పారించడంలో పోటీ పడ్డాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు జరిగే నాలుగో టి20లో భారత్, వెస్టిండీస్ తలపడతాయి.
ప్రస్తుతం సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా...ఇక్కడా గెలిచి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3–1తో సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే గత పోరులో కాస్త వెనుకబడినా... కోలుకొని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో విండీస్ సిద్ధమైంది. మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రాకుండా హోటల్ గదులకే పరిమితమయ్యారు.
మార్పుల్లేకుండా...
గత మ్యాచ్‌లో భారత్ 223 పరుగులు చేయడంతో పాటు ఈ పర్యటనలో తొలిసారి ఒక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి స్కోరును నిలబెట్టుకోగలిగింది. చివర్లో పదునైన బౌలింగ్ టీమిండియాను గెలిపించింది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగిన జట్టు ఇక్కడ కూడా దానినే కొనసాగించవచ్చు. అర్‡్షదీప్ ముందుండి నడిపించగా... ప్రిన్స్, మయాంక్ యాదవ్ అండగా నిలిచారు. అక్షర్ పటేల్‌కు తోడుగా స్పిన్‌లో నమన్ ధీర్ కూడా రాణిస్తుండటం సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్‌లలో చాన్స్ లభించని ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. ఇప్పుడు ‘సన్‌రైజర్స్’ హోం మైదానంలో అతను ఎలా ఆడతాడనేది ఆసక్తికరం.
రెండేళ్ల క్రితం ఇక్కడ ఆడిన టి20లో నితీశ్ తొలి బంతికే వెనుదిరిగాడు! బ్యాటింగ్ విషయంలో జట్టుకు ఎలాంటి ఆందోళన లేదు. విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ, సామ్సన్ చెలరేగితే మ్యాచ్‌పై ఆరంభంలోనే పట్టు చిక్కడం ఖాయం. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. 73 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్ తర్వాత తొలిసారి తన సొంతగడ్డపై భారత్ తరఫున బరిలోకి దిగుతున్న తిలక్‌వర్మపై అందరి దృష్టీ నిలిచింది. గత టి20లో అనూహ్యంగా రనౌటైన తిలక్ ఈసారి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో వైభవ్ సూర్యవంశీ తన అవకాశం కోసం ఇంకా ఎదురు చూడక తప్పదు.
షెఫర్డ్ కోలుకుంటాడా...
రెండో టి20లో భారత్ ఓటమిలో రొమారియో షెఫర్డ్ కీలక పాత్ర పోషించాడు. గాయంతో బాధపడుతూనే అతను 13 బంతుల్లో 34 పరుగులు బాది విండీస్‌ను గెలిపించాడు. అయితే గత మ్యాచ్ నుంచి తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా బరిలోకి దిగాలని విండీస్ కోరుకుంటోంది. ఈ పర్యటనలో తొలిసారి విఫలమైన కెప్టెన్ షై హోప్ మళ్లీ సత్తా చాటితే ఆ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఓడినా హెట్‌మైర్, పూరన్, పావెల్ ప్రభావాన్ని తక్కువ చేయలేం. కాబట్టి బ్యాటింగ్‌కు సంబంధించి విండీస్‌కు ఎలాంటి సమస్యా లేదు. మ్యాచ్‌కు ముందు రోజు ‘ప్రపంచం మొత్తం వేర్వేరు లీగ్‌లలో ఆడే వెస్టిండీస్ క్రికెటర్లు ఈ ఫార్మాట్‌లో ఎప్పుడైనా ప్రమాదకారులే.
చివరకు 11వ నంబర్ ఆటగాడు కూడా భారీ షాట్లు ఆడగలడు’ అని భారత ప్లేయర్ తిలక్‌వర్మ విశ్లేషించడం ఆ జట్టు బలాన్ని చూపిస్తోంది. అయితే బౌలింగ్ విషయంలోనే టీమ్ కాస్త అదృష్టాన్ని ఆశిస్తోంది. బౌలర్లకు పిచ్ కాస్త సహకరించి ప్రత్యర్థిని కట్టడి చేయగలిగితే బ్యాటింగ్‌తో విజయాన్ని అందుకోవచ్చని జట్టు భావిస్తోంది. టీమ్ బౌలర్లలో ఎవరికి కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి బౌలర్‌గా గుర్తింపు లేదు. అందరూ తమ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నవారే. ఉన్నంతలో సీనియర్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ కాస్త్ మెరుగ్గా కనిపిస్తున్నాడు. అభిషేక్ మినహా ఇతర భారత ఎడమచేతివాటం బ్యాటర్లను నిలువరించడంలో అతను సఫలమవుతున్నాడు.
సొంత గడ్డపై నా తొలి అంతర్జాతీయ మ్యాచ్ అదీ వైస్ కెప్టెన్‌గా ఆడబోవడం పట్ల నాకు ఒక ప్రత్యేక క్షణం. నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టం అయినా మిడిలార్డర్‌లో కూడా పరిస్థితికి తగినట్లుగా ఆడగలను. జట్టు తొందరగా వికెట్లు కోల్పోతే కొంత సమయం తీసుకుంటాను. లేదంటే టాప్–3 కనీసం 15వ ఓవర్ వరకు ఆడితే ఆ తర్వాత తొలి బంతినుంచి దూకుడుగా ఆడటం మొదలు పెడతా. ఇక్కడి కొత్త పిచ్‌పై కొన్ని బంతులు ఆడితే గానీ ఎలా స్పందిస్తుందో చెప్పలేను. విండీస్‌ను ఏ రకంగా కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. – తిలక్ వర్మ, వైస్ కెప్టెన్
పిచ్, వాతావరణం
ఉప్పల్ స్టేడియం పిచ్ భారీ స్కోర్లకు వేదిక. అయితే ఈసారి పిచ్ కొత్తగా వేయడంతో కాస్త భిన్నంగా ఉండవచ్చు. మ్యాచ్ రోజున ఎలాంటి వర్షసూచనా లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్, నమన్, నితీశ్ రెడ్డి, అక్షర్, అర్‡్షదీప్, ప్రిన్స్, మయాంక్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), కామిల్ పూరన్, హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్/ సాంప్సన్, ఛేజ్, స్ప్రింగర్, కీమో పాల్, షామర్ జోసెఫ్, మోతీ.


