ప్రపంచం 'గోల్‌'మయం! | Football World Cup starts today | Sakshi
Sakshi News home page

ప్రపంచం 'గోల్‌'మయం!

Jun 11 2026 3:33 AM | Updated on Jun 11 2026 3:35 AM

Football World Cup starts today

నేటి నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మెక్సికో ‘ఢీ’

ఫేవరెట్స్‌గా అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్‌

సంచలనాలపై ఆసియా, ఆఫ్రికా జట్ల దృష్టి

ఎప్పుడూ క్రికెట్, క్రికెట్టేనా... ఇంకేం ఆటలు లేవా చూసేందుకు... మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఏడాదికో ప్రపంచ కప్‌ అంటూ  వచ్చిపోతోంది... పైగా పేరుకే కానీ నాలుగు పెద్ద జట్లు కూడా లేని వరల్డ్‌కప్‌లో వినోదం ఏముంటుంది... ఈ మాటలన్నీ మనమంతా వింటూనే ఉన్నాం. అయితే వీటన్నింటికి సమాధానమిచ్చేందుకు మన కోసం మరో ఆటలో మెగా ఈవెంట్‌ వచ్చేసింది. ఏకంగా 48 దేశాలు తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి... అసలైన ‘విశ్వ’ విజేతను తేల్చే ఈ సమరం నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. 

ఇక్కడా సూపర్‌ స్టార్లు ఉంటారు... కానీ వారు మాత్రమే ఉండరు... ఒక్కో జట్టులో ఎంతో మంది అసాధారణ ప్రతిభావంతులు ... వారి ప్రతి అడుగులో, ప్రతీ కదలికలో కనిపించే చురుకుదనం, వేగం మనల్ని కట్టిపడేస్తాయి. పెద్దా, చిన్నా తేడా లేదు... సంచలనాలకు ఇంతకంటే సరైన వేదిక లేదు... ఏ జట్లు  ఆడినా... చివరకు మ్యాచ్‌లో ఎవరు గెలిచినా... ఆ 90 నిమిషాల పోరాటం మన నరాల్లోకి కూడా ఎక్కేస్తుంది.

మిగతా మూడేళ్ల 11 నెలలు ఎవరు ఎక్కడ ఎలా ఆడినా పట్టించుకోని అభిమానులు ఈనెల రోజుల పాటు ఆటగాళ్లకు అతి పెద్ద ఫ్యాన్‌లుగా మారిపోయి నీరాజనాలు పడతారు... ప్రత్యక్షంగా స్టేడియాల్లో చూసే అభిమానులే కాదు... ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో, ఫోన్‌లలో ఈ మెగా సంబరాన్ని వీక్షించే కోట్లాది మందికి ఈ ఫుట్‌బాల్‌ పండగ ఫుల్‌ వినోదం పంచడం గ్యారంటీ... భారత అభిమానులు నెల రోజులకు పైగా జరిగే ఈ 104 మ్యాచ్‌ల సంబరాలను చూసేందుకు నిద్ర లేని రాత్రులు గడపాల్సిందే. 

అంతటితో ఆగకుండా తెల్లవారుజామున ఆటగాళ్ల విన్యాసాల కబుర్లతో చాయ్‌ పే చర్చ జరగాల్సిందే... మెస్సీ, రొనాల్డో, నెమార్, మోడ్రిచ్, సలా, ఎంబాపె, లామినె యామల్, ఎండ్రిక్, ఫ్లోరియన్‌ విట్జ్‌... ఇలా కొన్ని పేర్లు అలా పెదాలపై పరుగెడుతూనే ఉంటాయి... అయినా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చూడాలంటే అన్ని రూల్స్, ఆటగాళ్లంతా తెలిసే ఉండాలా ఏంటి? కంటిచూపుతో బంతిని అనుసరిస్తూ వెళ్లిపోతే చాలు... ఆ ఊపు, ఆ జోష్‌తో మనమే మైదానంలో పరుగెడుతున్న భావన రావడం ఖాయం!

మెక్సికో సిటీ: ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన ఈవెంట్‌ వరల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు నేడు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు మెక్సికో సిటీలో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. 23వ ప్రపంచకప్‌ టోర్నీలో తొలిసారి 48 జట్లు పాల్గొంటున్నాయి. 1998 నుంచి 2022 వరకు ప్రపంచకప్‌ టోర్నీల్లో 32 జట్లు పోటీపడ్డాయి. అంతేకాకుండా తొలిసారి మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) కలిసి టోర్నీని నిర్వహిస్తున్నాయి.

అమెరికాలో 11 వేదికల్లో... మెక్సికోలో 3 వేదికల్లో... కెనడాలో 2 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.  డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్లకు తదుపరి టోర్నీ అంతగా అచ్చిరాలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు (ఇటలీ; 1934, 1938... బ్రెజిల్‌; 1958, 1962) మాత్రమే ప్రపంచకప్‌ టైటిల్‌ను  నిలబెట్టు కున్నాయి. మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా జట్టు బ్రెజిల్, ఇటలీ సరసన చేరుతుందో లేదో జూలై 19వ తేదీన తెలుస్తుంది. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, జర్మనీ జట్లు కూడా టైటిల్‌ రేసులో ఉన్నాయి. 

 

39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ దశ ముగిశాక 12 గ్రూప్‌ల్లో టాప్‌–2లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన 8 అత్యుత్తమ జట్లు నాకౌట్‌ దశకు చేరుకుంటాయి. ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా, యూరోప్‌ దేశాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. 12 సార్లు యూరోప్‌ దేశాలు, 10 సార్లు దక్షిణ అమెరికా దేశాలు విశ్వవిజేతలుగా నిలిచాయి. ఆసియా నుంచి దక్షిణ కొరియా (2002లో నాలుగో స్థానం), ఆఫ్రికా నుంచి మొరాకో (2022లో మొరాకో నాలుగో స్థానం) మాత్రమే ఒక్కోసారి సెమీఫైనల్‌ చేరుకున్నాయి. ఈసారి ఆసియా నుంచి జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియా... ఆఫ్రికా నుంచి మొరాకో, ఘనా, సెనెగల్‌ నాకౌట్‌ దశకు చేరుకోవచ్చు.  

ఇక ఫుట్‌బాల్‌లోని అన్ని ప్రముఖ టైటిల్స్‌ గెల్చుకున్న క్రిస్టియానో రొనాల్డో ఈసారైనా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంటాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. సీనియర్‌ స్టార్స్‌ మెస్సీ, రొనాల్డో, ఎంబాపె (ఫ్రాన్స్‌), లుకా మోడ్రిచ్‌ (క్రొయేíÙయా), హ్యారీ కేన్‌ (ఇంగ్లండ్‌), నెమార్‌ (బ్రెజిల్‌)లకు దీటుగా టీనేజ్‌ స్టార్స్‌ లామినె యామల్‌ (స్పెయిన్‌), జమాల్‌ ముసియాలా (జర్మనీ), ఎండ్రిక్‌ (బ్రెజిల్‌), అర్దా గులెర్‌ (టర్కీ), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్‌) తమ ప్రత్యేకతను చాటుకోవడానికి సిద్ధమయ్యారు.  

3 అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ఆడబోతున్న ముగ్గురు ప్లేయర్లుగా మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌), గిలెర్మో ఒచోవా (మెక్సికో) రికార్డు సృష్టించనున్నారు.

8 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో మెక్సికో జట్టు పాలుపంచుకోనుండటం ఇది ఎనిమిదోసారి. మరే జట్టు ఇన్ని ఆరంభ మ్యాచ్‌ల్లో పోటీపడలేదు. 2010 ప్రపంచకప్‌ కూడా మెక్సికో–దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోనే మొదలైంది.

2 మరో రెండు గోల్స్‌ చేస్తే పోర్చుగల్‌ కెపె్టన్‌ క్రిస్టియానో రొనాల్డో (ప్రస్తుతం 15 గోల్స్‌) ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా మిరోస్లావ్‌ క్లోజ్‌ (16 గోల్స్‌; జర్మనీ) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. అంతేకాకుండా వరుసగా 6 ప్రపంచకప్‌లలో గోల్‌ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర లిఖిస్తాడు.

1248 ఈ ప్రపంచకప్‌లో 48 జట్ల తరఫున బరిలోకి దిగనున్న మొత్తం క్రీడాకారులు. 1248లో 891 మంది ప్లేయర్లు తమ దేశం తరఫున తొలిసారి ప్రపంచకప్‌ ఆడుబోతున్నారు.

7 ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్న వరల్డ్‌ చాంపియన్స్‌ (బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్‌) జట్లు. నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఇటలీ వరుసగా మూడోసారి అర్హత సాధించలేదు. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్‌ జరగ్గా... 8 దేశాలు విజేతలుగా నిలిచాయి.

4 ఉజ్బెకిస్తాన్, కురసావ్, కేప్‌ వెర్డె, జోర్డాన్‌ జట్లు తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్నాయి. మిగతా 44 జట్లలో బ్రెజిల్‌ మాత్రమే వరుసగా 23 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడుతున్న ఏకైక జట్టు కానుంది. బ్రెజిల్‌ తర్వాత అత్యధికసార్లు ప్రపంచకప్‌ ఆడుతున్న జట్లుగా జర్మనీ (21), అర్జెంటీనా (19), మెక్సికో (18), ఇటలీ (18), ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్‌ (17 సార్లు చొప్పున), బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి.

ప్రైజ్‌మనీ ఎంతంటే...
ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌–2026 టోర్నీ విజేత జట్టుకు 5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 476 కోట్లు) లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 314 కోట్లు), మూడో స్థానంలో నిలిచిన టీమ్‌కు 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 276 కోట్లు), నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 257 కోట్లు) ఇస్తారు.

5–8వ స్థానాలజట్లకు 1 కోటీ 90 లక్షల డాలర్ల (రూ. 181 కోట్లు) చొప్పున... 9–16వ స్థానాల జట్లకు  1 కోటీ 50 లక్షల డాలర్ల (రూ. 142 కోట్లు) చొప్పున ... 17 నుంచి 32వ స్థానాల్లో నిలిచిన  జట్లకు 1 కోటీ 10 లక్షల డాలర్ల (రూ. 104 కోట్లు) చొప్పున... 33–48వ స్థానం వరకు నిలిచిన జట్లకు 90 లక్షల డాలర్ల (రూ. 85 కోట్లు) చొప్పున లభిస్తాయి. 

Advertisement
 
Advertisement
Advertisement