
భారత దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని వీరాభిమాని ఒకరు దుర్మరణం చెందారు. ధోనిని దేవుడిలా ఆరాధించే జయ్ జానీ అనే 27 ఏళ్ల యువకుడు గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్ జిల్లాలో గల తన స్వగ్రామం రబరికాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ నెల 12న జయ్ తన వ్యవసాయ భూమికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు.
జయ్.. ఐపీఎల్ 2024 సమయంలో నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరిగిన మ్యాచ్‌లో భద్రతా సిబ్బందిని దాటి ధోని పాదాలను తాకిన ఘటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జయ్ ఆకస్మిక మరణం ధోని అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశ్వవ్యాప్తంగా ధోని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.
జయ్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతనికి Instagramలో దాదాపు 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ధోని వల్లే అతనికి ఇంత పాలోయింగ్ లభించింది. జయ్ Dhoni Ashiq Official పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు.
ఈ ఛానల్‌కు 13,000కి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్‌లో జయ్ ధోని సంబంధించిన ఎడిటెడ్ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు. తద్వారా ధోనిపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు.
సీఎస్‌కేకు చేదు అనుభవం
ఇదిలా ఉంటే, ధోని ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్‌కేకు గత ఐపీఎల్ సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
ఈ సీజన్ మధ్యలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో, ధోని మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌లో ధోని 13 ఇన్నింగ్స్‌ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు చేశాడు. ధోని మోకాలి నొప్పితో బాధపడుతూనే ఈ సీజన్ మొత్తం ఆడాడు.