
ఆసియా కప్-2025లో (Asia cup 2025) బంగ్లాదేశ్ (Bangladesh) ఓ మోస్తరు ప్రదర్శనలతో ముందుకెళ్తుంది. గ్రూప్ దశలో హాంగ్‌కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఆ జట్టు.. ఈ దశలో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది.
ఆ జట్టు రేపు జరుగబోయే వారి రెండో సూపర్-4 మ్యాచ్‌లో పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాల్సి ఉంది (India Vs Bangladesh). ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) టీమిండియాపై (Team India) అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకపై గాలివాటంగా లభించిన గెలుపును (వాపును) చూసుకొని బలుపులా భావిస్తున్న అతను.. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టైన టీమిండియాతోనే మైండ్‌గేమ్ ఆడుతున్నాడు.
ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రతి జట్టుకి భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యం కాని, రికార్డులు కాదంటూ బీరాలు పలికాడు.
భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు అయ్యుండొచ్చు, మేము మా బెస్ట్ క్రికెట్ ఆడి వాళ్ల నుంచి తప్పులు రాబడతామని అతి విశ్వాసం ప్రదర్శించాడు. మేము శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు కాదు, టోర్నీని గెలిచేందుకు వచ్చామని గొప్పలు పోయాడు.
రేపు భారత్‌తో, ఆతర్వాతి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్‌తో ఆడటంపై మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం ఏ జట్టుకైనా కష్టమే అని అన్నాడు. మా పట్ల ఇలా జరగడం అన్యాయమని వ్యాఖ్యానించాడు.
సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తాహతకు మించినవిగానే అనిపిస్తున్నప్పటికీ.. వారిలోని ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కొందరు భారత అభిమానలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, చాలామంది లైట్‌గా తీసుకుంటున్నారు.
ఆమాత్రం జోష్‌తో బరిలోకి దిగితేనే టీమిండియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలదని అంటున్నారు. సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది.
వాస్తవానికి బంగ్లాదేశ్‌కు ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. కాస్త అటు, ఇటు అయ్యుంటే శ్రీలంకనే గెలిచేది. చివరి ఓవర్‌లో గెలుపుకు 5 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నసుమ్ అహ్మద్ ఐదో బంతికి రిస్క్ చేసి సింగిల్ తీయడంతో ఆ జట్టు గెలుపు ఖరారైంది.