ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం | England Wicket Keeper Jordan Cox Slams Blasting Hundred In T20 Blast, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం

Jul 18 2025 9:49 AM | Updated on Jul 18 2025 11:01 AM

England Wicket Keeper Jordan Cox Slams Blasting Hundred In T20 Blast

టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ యువ వికెట్‌కీపర్‌ జోర్డన్‌ కాక్స్‌ (ఎసెక్స్‌) మహోగ్రరూపం దాల్చాడు. నిన్న (జులై 17) హ్యాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న కాక్స్‌ 11 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్‌లో కాక్స్‌కు ఇదే తొలి సెంచరీ.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  హ్యాంప్‌షైర్‌.. టాబీ అల్బర్ట్‌ (55 బంతుల్లో 84; 12 ఫోర్లు, సిక్స్‌), కార్ట్‌రైట్‌ (23 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్‌ ప్రెస్ట్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్‌ ఫుల్లర్‌ (6 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌.. ఆదిలో తడబడినప్పటికీ, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జోర్డన్‌ కాక్స్‌ శివాలెత్తిపోవడంతో మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాక్స్‌ ఒక్కడే ఒంటిచేత్తో ఎసెక్స్‌కు విజయతీరాలకు చేర్చాడు. 

సహచర బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బంది పడిన చోట కాక్స్‌ విలయతాండవం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారీ లక్ష్యం చిన్నబోయేలా చేశాడు. ఫలింతగా ఎసెక్స్‌ 4 వికెట్ల తేడాతో హ్యాంప్‌షైర్‌పై ఘన విజయం సాధించింది.

మిగిలిన ఎసెక్స్‌ బ్యాటర్లలో కైల్‌ పెప్పర్‌ 23, పాల్‌ వాల్టర్‌, క్రిచ్లీ, బెన్‌కెన్‌స్టెయిన్‌ తలో 13, చార్లీ అల్లీసన్‌ 5, నోవా థైన్‌ 4, సైమన్‌ హార్మర్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement