చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌ | Vaibhav Suryavanshi Sets World Record Becomes 1st Player In History To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌

Nov 14 2025 6:53 PM | Updated on Nov 14 2025 7:29 PM

Vaibhav Suryavanshi Sets World Record Becomes 1st Player In History To

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్‌ సూర్యవంశీ రికార్డులకెక్కాడు.

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2025 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌ శుక్రవారం ఈ ఫీట్‌ నమోదు చేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ఈవెంట్లో భారత్‌-‘ఎ’ జట్టు.. యూఏఈతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది.

వైభవ్‌ సూర్యవంశీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌
భారత ఓపెనర్లలో ప్రియాన్ష్‌ ఆర్య (10) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు సాధించాడు. వైభవ్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం.

 

అయితే, యూఏఈ బౌలర్‌ ముహమ్మద్‌ ఫరాజుద్దీన్‌ బౌలింగ్‌లో అహ్మద్‌ తారిక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌.. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీకి పొట్టి ఫార్మాట్లో ఇది రెండో శతకం. అంతేకాదు రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ కూడా! ఈ క్రమంలోనే పద్నాలుగేళ్ల ఈ బిహారీ పిల్లాడు సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు
కాగా ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడిన వైభవ్‌ సూర్యవంశీ.. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన విషయం తెలిసిందే. అప్పుడు అతడి వయసు పద్నాలుగేళ్ల 32 రోజులు మాత్రమే. ఇక తాజాగా ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌లో భాగంగా వైభవ్‌ 32 బంతుల్లోనే శతక్కొట్టి తన రికార్డును తానే సవరించాడు.

పద్నాలుగేళ్ల 232 రోజుల వయసులో తన రెండో టీ20 సెంచరీ చేసిన వైభవ్‌.. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు.. భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ రికార్డు సవరించాడు.

టీ20లలో ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు వీరే
🏏ఉర్విల్‌ పటేల్‌- 2024లో గుజరాత్‌ తరఫున త్రిపురతో మ్యాచ్‌లో 28 బంతుల్లో
🏏అభిషేక్‌ శర్మ- 2024లో పంజాబ్‌ తరఫున మేఘాలయపై 28 బంతుల్లో
🏏రిషభ్‌ పంత్‌- 2018లో ఢిల్లీ తరఫున హిమాచల్‌ ప్రదేశ్‌పై 32 బంతుల్లో
🏏వైభవ్‌ సూర్యవంశీ- 2025లో భారత్‌ తరఫున యూఏఈపై 32 బంతుల్లో శతకం

భారత్‌ భారీ స్కోరు
ఇదిలా ఉంటే.. యూఏఈతో మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ (144)తో పాటు కెప్టెన్‌ జితేశ్‌ శర్మ కూడా అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో నమన్‌ ధీర్‌ (34) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్‌ 297 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్‌ ఫరాజుద్దీన్‌, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌, ముహమ్మద్‌ అర్ఫాన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.  

చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌దే పైచేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement