అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 135 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 355 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక వన్డే స్కోర్ కావడం విశేషం. ఓపెనర్ టామ్ బాంటన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బాంటన్ కేవలం 99 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేశడు. అతడితో పాటు జోరూట్(62), విల్ జాక్స్(54), హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్‌లెట్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, రిలే మెరిడిత్, కూపర్ కొన్నోలీ తలా వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 220 పరుగులకే కుప్పకూలింది. మాట్ రెన్షా (63), కామెరాన్ గ్రీన్ (64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ కేవలం 27 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతననాన్ని శాసించాడు.
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్
కాగా 21వ శతాబ్దంలో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును 100 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. గత 39 ఏళ్లలో స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.
చదవండి: వారి వల్లే గెలిచాం.. చాలా సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్


