
బౌలింగ్‌లో అదరగొట్టిన సోఫి
లంకపై 89 పరుగులతో ఇంగ్లండ్ జయభేరి
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు 89 పరుగుల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించింది. బ్యాటింగ్‌లో విరోచిత శతకం సాధించిన కెప్టెన్ బ్రంట్ (117 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బౌలింగ్‌తో 2 వికెట్లు పడగొట్టింది. టాస్ నెగ్గిన లంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
టాపార్డర్‌లో అమీ జోన్స్ (11), బ్యూమోంట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు), హీథర్‌నైట్ (47 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. ఇలాంటి స్థితిలో నాట్ సీవర్ బ్రంట్ ఒంటరి పోరాటం చేసింది. సోఫియా డన్‌క్లే (18), ఎమ్మా లాంబ్ (13), చార్లీ డీన్ (19)లతో కలిసి జట్టు స్కోరును నడిపించింది. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసింది. లంక బౌలర్లలో ఇనోక రణవీర 3 వికెట్లు పడగొట్టగా, ఉదేశిక ప్రబోధని, సుగంధిక కుమారి చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హాసిని పెరిర (60 బంతుల్లో 35; 3 ఫోర్లు), మిడిలార్డర్‌లో హర్షిత సమరవిక్రమ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. మిగతా వాళ్లంతా ఇంగ్లండ్ బౌలింగ్‌కు తలొంచారు. నీలాక్షిక సిల్వా (23) మినహా ఇంకెవరూ రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు.
సోఫి ఎకిల్‌స్టోన్ (10–3–17–4) తన మ్యాజిక్ స్పెల్‌తో లంకను కూల్చేసింది. నాట్ సీవర్, చార్లీ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆడిన మూడు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలువగా, ఇంకా బోణీ చేయలేకపోయిన శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. లంక మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ రనౌట్ 11; బ్యూమోంట్ (సి)హర్షిత (బి) సుగంధిక 32; హీథర్‌నైట్ (సి) విహంగ (బి) ఇనొక 29; నాట్ సీవర్ (సి) నీలాక్షిక (బి) ప్రబోధని 117; సోఫియా (సి) అండ్ (బి) కవిశా 18; ఎమ్మా లాంబ్ (బి) ఇనొక 13; క్యాప్సీ (స్టంప్డ్) సంజీవని (బి) ఇనొక 0; చార్లీ డీన్ (సి) విహంగ (బి) ప్రబోధని 19; సోఫి ఎకిల్‌స్టోన్ (స్టంప్డ్) సంజీవని (బి) సగంధిక 3; లిన్సే స్మిత్ నాటౌట్ 5; లారెన్ బెల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–24, 2–49, 3–109, 4–146, 5–168, 6–168, 7–206, 8–216, 9–252. బౌలింగ్: ప్రబోధని 9–0–55–2, సుగంధిక 10–0–66–2, చమరి 5–0–21–0, ఇనొక 10–1–33–3, విహంగ 8–0–42–0, కవిశా 8–0–34–1.
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (సి) క్యాప్సీ (బి) సోఫి 35; చమరి (బి) సోఫి 15, విష్మీ (బి) చార్లీ డీన్ 10; హర్షిత (సి) బెల్ (బి) సోఫి 33; కవిశా (బి) సోఫి 4; నీలాక్షిక (సి)హీథర్‌నైట్ (బి) క్యాప్సీ 23; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) నాట్ సీవర్ 10; విహంగ (సి) చార్లీ డీన్ (బి) నాట్ సీవర్ 3; సుగంధిక (బి) చార్లీ డీన్ 4; ప్రబోధని (సి) నాట్ సీవర్ (బి) లిన్సే స్మిత్ 0; ఇనొక నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–37, 2–95, 3–98, 4–103, 5–116, 6–134, 7–145, 8–157, 9–157, 10–164. బౌలింగ్: లారెన్ బెల్ 8–1–32–0, లిన్సే స్మిత్ 8.4–1–22–1, నాట్ సీవర్ 5–0–25–2, చార్లీ డీన్ 9–1–47–2, అలైస్ క్యాప్సీ 5–1–15–1, సోఫి 10–3–17–4.