
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)అండగా నిలిచాడు. సూర్యపై ఒత్తిడి పెంచడం సరికాదని.. కెప్టెన్‌గా తనదైన శైలిలో అతడు విజయాలు సాధిస్తున్న తీరు అద్భుతమని కొనియాడాడు. కాగా ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
అయితే, నామమాత్రపు మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడం.. బ్యాటర్‌గా విఫలం కావడం పట్ల సూర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా గత కొంతకాలంగా సూర్య బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో సూర్య 12.41 సగటు, 112.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 87 పరుగులే చేయగలిగాడు.
బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు
ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)తో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బ్యాటింగ్ వైఫల్యంపై మరోసారి చర్చ జరుగుతుండగా.. అశ్విన్ స్పందించాడు. ‘‘కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సగటు పడిపోయిందని చాలా మంది విమర్శిస్తున్నారు.
కానీ అతడు పగ్గాలు చేపట్టిన తర్వాతే కదా.. కొత్త బ్రాండ్‌తో టీమిండియా ముందుకు సాగుతోంది. అతడి సగటు 40 ఉండాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్‌లో యావరేజ్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
హైరిస్క్ మ్యాచ్‌లు
కెప్టెన్‌గా సూర్య హైరిస్క్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. నిజంగా అతడి నైపుణ్యాలు అద్భుతం. గతంలో రోహిత్ శర్మ కూడా ఇలానే చేశాడు. తన వికెట్ కంటే కూడా.. దూకుడుగా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు సూర్య అదే అనుసరిస్తున్నాడు. వన్‌డౌన్‌కే పరిమితం కాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో వేర్వేరు స్థానాల్లో వస్తున్నాడు.
అతడి వెంట పడకండి
సూర్య తక్కువ స్ట్రైక్ రేటుతో 40 పరుగులు చేయడం కంటే కూడా... 170కి పైగా స్ట్రైక్‌రేటుతో 25 పరుగులు చేసినా నేను సంతోషిస్తా. దయచేసి అతడి వెంట పడకండి. అతడిపై ఒత్తిడి పెంచకండి.
టీ20 క్రికెట్‌లో బ్యాటర్ సగటు కంటే.. అతడి ఇన్నింగ్స్ ఎంతమేర ప్రభావం చూపుతుందనేదే ముఖ్యం’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2025లో సూర్య ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేశాడు. లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్‌లో 37 బంతుల్లో 47 పరుగులు చేయడం అతడి తాజా అత్యుత్తమ ప్రదర్శన.
చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్