
టీమిండియాతో రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. లార్డ్స్ (Lord's Test)లో ఇందుకు బదులు తీర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎట్టకేలకు గిల్ సేనపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో 2-1తో ముందంజ వేసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)ది కీలక పాత్ర.
తగ్గేదేలే
ఓవైపు ఫిట్‌నెస్ సమస్యలు వేధిస్తున్నా స్టోక్స్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఇటు బ్యాట్‌తోనూ.. అటు బంతితోనూ సత్తా చాటాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు.. టీమిండియా కీలక వికెట్లు కూల్చి జట్టు విజయానికి పునాది వేశాడు.
లార్డ్స్ టెస్టులో స్టోక్స్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 44, 33 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (40), నితీశ్ రెడ్డి (30) వికెట్లు కూల్చిన స్టోక్స్.. రిషభ్ పంత్ (74)ను రనౌట్ చేశాడు.
అదే విధంగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (39), ఆకాశ్ దీప్ (1) వికెట్లను పడగొట్టిన స్టోక్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ పట్టుదల, జట్టు ప్రయోజనాల పట్ల అతడి నిబద్ధత గురించి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేను కెప్టెన్‌గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదు
టీమిండియాతో నాలుగో టెస్టుకు ముందు రూట్ మాట్లాడుతూ.. ‘‘అతడు ప్రతిసారీ నా మాట వినడు. ముఖ్యంగా నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎంతగా చెప్పినా వినేవాడే కాదు. తన శరీరాన్ని కష్టపెట్టి ఎక్కువగా బౌలింగ్ చేసేవాడు.
పనిభారాన్ని తగ్గించుకోమని చెబితే.. తను మాత్రం అసాధారణ రీతిలో జట్టు కోసం పట్టుదలగా ఆడేవాడు. కొన్నిసార్లు అతడి గాయాలు మరీ తీవ్రతరమైతే పరిస్థితి ఏమిటని నేను భయపడిపోయేవాడిని. కానీ అతడు మాత్రం రెండుసార్లు తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా మళ్లీ కోలుకుని ఇలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆట పట్ల తన అంకిత భావం అలాంటిది మరి’’ అని స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా లార్డ్స్ టెస్టులో రూట్- స్టోక్స్ కలిసి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 88, 67 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (104) చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 40 పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ (జూలై 23- 27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా