సాక్షి, హైదరాబాద్: రగ్బీ ప్రీమియర్ లీగ్ మహిళల తొలి సీజన్ టైటిల్‌ను ఢిల్లీ రెడ్స్ జట్టు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ 22–10 పాయింట్ల తేడాతో చెన్నై బుల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్ ముగిసేసరికి 5–0తో ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీ, రెండో క్వార్టర్‌లోనూ పైచేయి సాధించి 10–5తో ముగించింది. మూడో క్వార్టర్‌లో ఇరు జట్ల సమ ఉజ్జీలుగా నిలవగా... ఆఖరి క్వార్టర్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. 15–5తో ముందంజ వేసిన ఢిల్లీ 20–5కు, ఆపై 22–5కు చేరింది.
అయితే ఈ దశలో పోరాడిన చెన్నై స్కోరును 10–22 వరకు తీసుకెళ్లినా...చివరకు ఓటమి తప్పలేదు. రెడ్స్ గెలుపులో లావెనా కవారు, ఎడెన్ కిల్గార్, సిలికా ఖాలో, ఇసడోరా లోప్స్ కీలక పాత్ర పోషించగా...చెన్నై తరఫున ముస్కాన్ పిప్లోడా, షీలా షజీరా రాణించారు. మహిళల లీగ్‌లో 10 దేశాలకు చెందిన 48 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. విజేతగా నిలిచిన ఢిల్లీకు రూ. 25 లక్షలు, రన్నరప్ చెన్నైకి రూ.15 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. జూన్ 28 వరకు పురుషుల లీగ్ కొనసాగుతుంది.


