చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Cricket Matt Renshaw Breaks Jacques Kallis Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Oct 14 2026 5:05 AM | Updated on Oct 14 2026 5:07 AM

Cricket Matt Renshaw Breaks Jacques Kallis Record

PC: CA Twitter

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మ్యాట్ రెన్‌షా టెస్టు క్రికెట్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెన్‌షా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో కదం తొక్కిన రెన్‌షా(190).. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 272 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్టు పడగొట్టాడు. తద్వారా రెన్‌షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

చరిత్ర సృష్టించిన రెన్‌షా

దక్షిణాఫ్రికా గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో 250కి పైగా పరుగులు చేసి, 2 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా (స్వదేశీ లేదా విదేశీ) రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు.

ఇంతకుముందు ప్రోటీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ 2012లో ఇదే డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో 224 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. కాలిస్ మూడు వికెట్లు తీసినప్పటికీ, 250 పరుగుల మార్క్‌ను మాత్రం చేరుకోలేకపోయాడు. ఆ రికార్డును ఇప్పుడు రెన్‌షా బ్రేక్ చేశాడు.

ఆసీస్ ఘన విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆ్రస్టేలియా 214 పరుగుల తేడాతో గెలుపొందింది. 421 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 102/4తో మంగళవారం చివరి రోజు రెండో  ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టు చివరకు 86.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్‌ (75; 10 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్‌ హాజల్‌వుడ్‌ 49 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. చివరి రోజు మిగిలిన ఆరు వికెట్లలో హాజల్‌వుడ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెన్‌షాకు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 284 పరుగులకు పరిమితమైంది. ఆసీస్‌ 314/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి 421 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement