క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం! | Cricket Australia Historic Move Privatisation Of BBL Leaves Fans Outraged | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!

Sep 8 2026 3:50 PM | Updated on Sep 8 2026 3:50 PM

Cricket Australia Historic Move Privatisation Of BBL Leaves Fans Outraged

PC: Cricket Australia

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీ టీ20 టోర్నమెంట్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. బీబీఎల్‌ జట్టు మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు సీఏ మంగళవారం ధ్రువీకరించింది.

కన్నేసిన ఐపీఎల్‌ ఓనర్లు?
మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ పురుషుల, మహిళల జట్ల యాజమాన్యంలో వంద శాతం వాటాను అమ్ముకునేందుకు అంగీకారం తెలిపినట్లు సీఏ పేర్కొంది. బీబీఎల్‌, మహిళల బీబీఎల్‌ 2027-28 సీజన్‌ నుంచి మెల్‌బోర్న్‌ జట్టుకు కొత్త యజమానులు రానున్నట్లు వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)​లోని పలు ఫ్రాంఛైజీల యజమానులు బీబీఎల్‌లోనూ జట్లను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పలు విదేశీ లీగ్‌లలో పెట్టుబడులు
కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లన్నీ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలవే అన్న సంగతి తెలిసిందే. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌, సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌, జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌, పర్ల్‌ రాయల్స్‌.. ఐపీఎల్‌లో వరుసగా లక్నో, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, రాజస్తాన్‌ ఫ్రాంఛైజీలకు చెందిన జట్లు.

ఇక కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ది హండ్రెడ్‌ వంటి పలు లీగ్‌లలోనూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల ఓనర్లు జట్లు కలిగి ఉన్నారు. ఇప్పుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటనతో బీబీఎల్‌లోనూ తమ వాటాను విస్తరించే అవకాశం ఉంది. 

నాశనానికి నాంది!
ఇదిలా ఉంటే.. క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బీబీఎల్‌ నాశనమైపోతుందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు.

కమిన్స్‌ ఏమన్నాడంటే..
మరోవైపు.. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాత్రం క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని స్వాగతించాడు. ‘‘ప్రైవేటీకరణ ద్వారా క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా బీబీఎల్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, ఆసీస్‌ కెప్టెన్‌గా నాకు టెస్టు క్రికెట్‌ అత్యంత ముఖ్యం’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

భారత్‌లో తొలి మ్యాచ్‌
ఇదిలా ఉంటే.. బీబీఎల్‌కు ఆదరణ పెంచే క్రమంలో భారత్‌లో మ్యాచ్‌ నిర్వహించేందుకు సీఏ సిద్ధమైన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో 2026-27 సీజన్‌ తొలి మ్యాచ్‌ జరుగనుంది. 

డిసెంబరు 12న జరిగే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తలపడనున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి జూలైలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement