ధీరజ్‌ పసిడి గర్జన | Bommadevara Dheeraj wins two gold medals in the World Cup tournament | Sakshi
Sakshi News home page

ధీరజ్‌ పసిడి గర్జన

Jun 15 2026 1:45 AM | Updated on Jun 15 2026 9:42 AM

Bommadevara Dheeraj wins two gold medals in the World Cup tournament

ప్రపంచకప్‌ టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌

అంటాల్యా (టర్కీ): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో విజయవాడకు చెందిన 24 ఏళ్ల ధీరజ్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు. ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్‌ మొహోద్‌తో కలిసి రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బంగారు పతకం గెలిచిన ధీరజ్‌... ఆ తర్వాత రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

ఈ ప్రదర్శనతో ధీరజ్‌ ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్‌–కుంకుమ్‌ (భారత్‌) ద్వయం 5–1 (37–36, 37–36, 39–39) సెట్‌ పాయింట్ల స్కోరుతో కిమ్‌ జె డియోక్‌–ఒహ్‌ యెజిన్‌ (దక్షిణ కొరియా) జంటను ఓడించి బంగారు పతకం గెల్చుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్‌ టోర్నీలో రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించడం విశేషం.

చివరిసారి 2022లో అంటాల్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో తరుణ్‌దీప్‌ రాయ్‌–రిధి ద్వయం భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.కిమ్‌ జె డియోక్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో... 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పురుషుల టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచిన కొరియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.  

నాలుగో ప్రయత్నంలో బంగారు గురి... 
మిక్స్‌డ్‌ టీమ్‌లో పసిడి గెలిచిన ఉత్సాహంతో వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. సెమీఫైనల్లో ధీరజ్‌ 6–4 (26–27, 28–28, 28–28, 30–27, 28–23) సెట్‌ పాయింట్ల స్కోరుతో మోరిట్జ్‌ వీసెర్‌ (జర్మనీ)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ కప్‌ టోర్నీ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు దూసుకొచ్చాడు. ఫైనల్లో ధీరజ్‌ 7–3 (30–29, 29–28, 27–27, 29–27, 30–29) సెట్‌ పాయింట్ల స్కోరుతో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ వు సియోక్‌ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. 

తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. గతంలో ధీరజ్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో (2023 అంటాల్యా, 2024 అంటాల్యా, 2025 సెంట్రల్‌ ఫ్లోరిడా) మూడు వ్యక్తిగత కాంస్యాలు గెలిచాడు. నాలుగో ప్రయత్నంలో పసిడి గర్జన చేశాడు.  

తండ్రి ప్రోత్సాహంతో... 
ధీరీజ్‌ తండ్రి బొమ్మదేవర శ్రవణ్‌ కుమార్‌ భారత ఆర్చరీ సంఘంలో టెక్నికల్‌ అఫీషియల్‌గా పని చేశారు. తండ్రి ప్రోత్సాహంతో ధీరజ్‌ ఆర్చరీ కెరీర్‌ 2006లో విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ప్రారంభమైంది. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగేళ్ల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నాక ధీరజ్‌ 2021లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్‌ దేశవాళీ పోటీల్లో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగిన ధీరజ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ పోటీపడనున్నాడు.

20 తన తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు ధీరజ్‌ గెలిచిన పతకాలు. ఇందులో 8 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

పసిడి పతకాలు గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచానంటే దాని వెనక నా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. గత 20 ఏళ్లుగా వారు పడిన శ్రమకు ఫలితం ఇది. కెరీర్‌లో ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. దానికి ఈ పతకం ప్రేరణగా నిలుస్తుంది. –ధీరజ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement