న్యూఢిల్లీ: భారత స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్... ఆర్చరీ ప్రపంచకప్‌ను ఆసియా క్రీడల సన్నాహకంగా భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... దాని కోసం ప్రకటించిన 12 మంది భారత జట్టులో ఈ ఇద్దరు తెలుగు ఆర్చర్లు చోటు దక్కించుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ఫలితాలు సాధిస్తున్న ఈ ఇద్దరూ... ఆసియా క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. ‘ఆసియా క్రీడలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలనుకుంటున్నా. దానికి ముందు జరగనున్న ప్రపంచకప్‌లో గురిని పరిశీలించుకుంటా. చాన్నాళ్లుగా నేను వాడుతున్న బాణాల ఉత్పత్తి ఆగిపోయింది.
ఇప్పుడు కొత్తవాటితో ప్రాక్టీస్ చేస్తున్నా. వాటినే ప్రపంచకప్‌లో వినియోగిస్తా. తద్వారా ఆసియా క్రీడలకు ముందు వాటిపై నాకొక అవగాహన వస్తుంది. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్త పరికరాలను పరీక్షించుకునేందుకు వరల్డ్‌కప్ సరైన వేదిక’ అని మంగళవారం కేంద్ర క్రీడా శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ మీడియా సమావేశంలో జ్యోతి సురేఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు మూడుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్న జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలు సహా ఐదు పతకాలు గెలిచింది. వచ్చే నెల 9 నుంచి 14 వరకు అంటాల్యా వేదికగా... జూలై 7 నుంచి 12 వరకు మాడ్రిడ్ వేదికగా రెండు ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి.
ప్రయోగాలు చేయాలనుంది..
మరోవైపు ధీరజ్ కూడా తన విల్లు సెట్టింగ్‌లు సర్దుబాటు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘మెరుగైన ఫలితాల కోసం ప్రతి మూడు నెలలకోసారి విల్లు సెట్టింగ్‌లు మారుస్తుంటా. గత డిసెంబర్ నుంచి కొత్త విల్లును వినియోగిస్తున్నా. దాన్ని పరీక్షించేందుకు తగినంత సమయం దొరకలేదు. ప్రపంచకప్‌లలో ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’ అని ధీరజ్ చెప్పుకొచ్చాడు.
మెక్సికోలో ప్రత్యేక శిబిరం..
ఈ ఏడాది జరిగిన తొలి ఆర్చరీ ప్రపంచకప్‌నకు ముందు మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు మెక్సికోలో క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జ్యోతి, ధీరజ్‌తో పాటు అతాను దాస్ వంటి పలువురు భారత అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్నారు. దాని కోసం స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా (సాయ్) రూ. 57.42 లక్షలు వెచి్చంచింది.
ఈ క్యాంప్‌లో భారత ఆర్చర్లకు తొలిసారి అధునాతన సాంకేతిక పరికరాలను పరీక్షించే వీలు చిక్కింది. ‘సీజన్ తొలి వరల్డ్‌కప్‌నకు ముందు అక్కడ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆర్చర్లు ఉపయోగిస్తున్న బాణాలను పరిశీలించాం. వాటిని ఉపయోగించే అవకాశం మాకు తొలిసారి లభించింది. మా ప్రదర్శననను విశ్లేíÙంచుకోవడానికి అక్కడ ఒక బంకర్ కూడా అందుబాటులో
ఉంది. ప్రపంచకప్‌నకు ముందు ఇది మంచి అనుభవం’ అని జ్యోతి చెప్పింది.
దీపిక, అతాను లేకుండానే..
సీనియర్ ఆర్చర్ల జోడీ దీపిక కుమారి, అతాను దాస్ ఆసియా క్రీడలకు సెలక్షన్ ట్రయల్స్‌లో విఫలమయ్యారు. దీంతో వారిని ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేయలేదు. ‘ఆ ఇద్దరూ ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో లేరు. కానీ వారు చాలా కాలంగా జట్టులో భాగంగా ఉన్నారు. శిక్షణ సందర్భంగా వారి అనుభవం మాకు ఎంతో ఉపయోగపడింది. మాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు.
ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనే వాటిని కూడా వివరించారు. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వారిచ్చిన సలహాలను ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు రాబ్టటేందుకు ప్రయతి్నస్తాం’ అని ధీరజ్ అన్నాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌లో భాగంగా ఉన్న జ్యోతి, ధీరజ్‌లపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా రూ. 24.56 లక్షలు, రూ. 66.28 లక్షలు ఖర్చుపెట్టింది.
చదవండి: 'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం!


