
జో రూట్
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఈసారి ఈ టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 21- 25 మధ్య తొలి టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇప్పటి నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు మైండ్‌గేమ్ మొదలుపెట్టేశారు.
ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అతడు పెద్దగా బ్యాట్ ఝులిపించలేడు. గతంలో కూడా ఇలాగే జరిగింది.
అతడికి ఇక నిద్రలేని రాత్రులే!
నాకు బ్రాడీ బౌలింగ్‌లో ఎలాగైతే కాళరాత్రులు మిగిలాయో.. రూట్‌కు కూడా జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో నిద్రలేని రాత్రులే మిగులుతాయి. జో అద్భుతమైన క్రికెటర్. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన రెండో ఆటగాడు.
కానీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం అతడికి కాస్త కష్టమే. దానిని అతడు ఈసారి అధిగమిస్తాడనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని వార్నర్ పేర్కొన్నాడు.
వార్నర్ ఓ జోకర్!
వార్నర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. ‘‘అతడు వార్నర్. వార్నర్ అంటే ఓ జోకర్ లాంటివాడు. రూటీ మైండ్‌లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఎన్నటికీ అది జరుగదు.
అసలు రూట్‌తో సరదా ఫైట్‌కు కూడా వార్నర్ సరిపోడు. అతడు వార్నర్.. జస్ట్ వార్నర్ అంతే!.. అంతేనా? కాదా?’’ అంటూ మొయిన్ అలీ వార్నర్ పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాషెస్ మొదలైన తర్వాత ఇంకెలా ఉంటుందో అంటూ ఇరుజట్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సూపర్ ఫామ్‌లో రూట్
కాగా జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో మూడు శతకాలతో దుమ్ములేపాడు. ఐదు టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించిన రూట్.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (754) తర్వాత రెండో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత్‌తో సిరీస్ సందర్భంగానే జో రూట్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రిక్కీ పాంటింగ్‌ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు రాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ఇలాంటి వాళ్లు సరిపోరు
ఈ విషయం గురించి మొయిన్ అలీ ప్రస్తావిస్తూ.. ‘‘రూటీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ లాంటి వాళ్ల మాటలు అతడిపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయినా.. రూట్ లాంటి వాళ్లను ప్రభావితం చేయాలంటే ఇలాంటి వాళ్లు సరిపోరు’’ అంటూ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కాగా నవంబరు 21- జనవరి 8 వరకు ఆసీస్- ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీ ఇందుకు వేదికలు.
చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్